పెళ్లిలో చిందులేసిన రకుల్‌.. పాట వైరల్‌

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ హీరోగా నటించిన సినిమా ‘దే దే ప్యార్‌ దే’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, టబు ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇందులో అజయ్‌ ప్రియురాలిగా రకుల్‌, ఆయన మాజీ భార్యగా టబు నటించారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. కాగా ఈ సినిమాలోని పాటను తాజాగా విడుదల చేశారు. ‘వడ్డీ షరాబన్‌..’ అని సాగే ఈ పాటలో రకుల్‌ స్టెప్పులేస్తూ, సందడి చేశారు. ఓ పెళ్లిలో ఆమె చిందేస్తూ కనిపించారు. ఎంతో హుషారు సాగిన ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే 9 లక్షల మందికిపైగా యూట్యూబ్‌లో వీక్షించడం విశేషం. సునిధీ చౌహాన్‌, నవ్‌రాజ్‌ హన్స్‌ ఈ పాటను ఆలపించారు. విపిన్‌ పట్వా సంగీతం అందించారు.

‘వడ్డీ షరాబన్‌..’ షూటింగ్‌ ఎంతో సరదాగా జరిగింది.. ఇది ఓ గొప్ప అనుభవం. ఇంత చక్కటి పాటను నాకిచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అని రకుల్‌ ట్వీట్‌ చేశారు. అకీవ్‌ అలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టీ సిరీస్‌ సంస్థ నిర్మించింది. మే 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.