సింగర్‌ వాణీ జయరామ్‌ మరణంపై అనుమానాలు!


ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె మరణం మిస్టరీగా మారింది. చెన్నైలోని నాగంబాక్కంలో గల హౌద్డౌస్ రోడ్డులోని సొంత ఇంట్లో వాణీ జయరామ్ ప్రమాదానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆమె మృతిపై పలు అనుమానాలు నెలకొన్నాయి.

వాణీ జయరామ్ ఇంట్లోని గ్లాస్ టేబుల్ మీద పడడంతో ఆమె ముఖానికి బలమైన గాయాలు అయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. వాణీ జయరామ్ ఇంట్లో ఒక్కరే ఉంటుండగా.. పనిమనిషి వచ్చి తలుపు కొట్టగా వాణీ జయరామ్ ఎంత సేపటికీ తలుపు తీయక పోవడంతో… ఆమె బంధువులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన బంధువులు తలుపులు తీసి చూడగా.. ఆమె రక్తపు మడుగులో పడి ఉంది.

దీంతో బంధువులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స చేయడం ప్రారంభించారు. కొంత సేపటికి తుది శ్వాస విడిచారని తెలిసింది. అయితే వాణీ జయరాం రక్తపు మడుగులో పడి ఉండడం ముఖంపై ఎవరో కొట్టినట్టు గాయాలు ఉండడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది సహజ మరణమేనా లేక ఎవరైనా ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసి చంపేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వాణీ జయరామ్ గదిలో శబ్దం రావడంతో కిటికీలోంచి చూశానని.. ఆ తర్వాతే బంధువులకు విషయం చెప్పినట్లు పని మనిషి వివరిస్తోంది.

దాంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్‌ నిపుణులు దాదాపు అరగంటపాటు వాణీ జయరాం ఫ్లాట్‌ను ఆధీనంలోకి తీసుకుని ఆధారాలు సేకరించారు. మరోవైపు వాణీ జయరాం పార్థివ దేహాన్ని పోస్టుమార్టం కోసం ఒమేదురార్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్‌ నిపుణులు ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత ఆమె పార్థివదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates