డాక్టర్‌ అవసరం లేదు.. మీ ఇద్దర్నీ కలవాలి: విజయ్‌ దేవరకొండ


యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ఇద్దరు చిన్నారులతో ప్రేమలో పడ్డారట. ఆయన ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్‌లో విజయ్ చేతికి స్వల్పగాయమైంది. ఆ ఫొటోను ఆయన సోషల్‌మీడియా వేదికగా అప్పట్లో షేర్‌ చేశారు. అయితే ఆ ఫొటోను చూసి ఇద్దరు చిన్నారులు ‘ఏమైంది.. విజయ్‌ కొండకు ఏమైంది..?’ అంటూ ఆయనపై జాలి చూపారు. అంతేకాదు ‘డాక్టర్‌ దగ్గరికి వెళ్లు..’ అని సలహా కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

విజయ్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ‘మీకు తగిలిన దెబ్బలు చూసి మా చిన్నారులు బాధపడుతున్నారు’ అని ట్వీట్‌ చేశారు. ఈ వీడియోను చూసిన విజయ్‌ ప్రతిస్పందించారు. ‘వీరితో ప్రేమలో పడ్డా. విజయ్‌ దేవరకొండకు డాక్టర్‌ అవసరం లేదు, కానీ మీ ఇద్దర్నీ కలవాలి అనుకుంటున్నాడు.. మీకు కుదురుతుందా?’ అని అడిగారు. దీనికి సదరు నెటిజన్‌ సంతోషంగా రిప్లై ఇచ్చారు. ‘కచ్చితంగా.. మిమ్మల్ని కలిస్తే మా పిల్లలు చాలా ఆనందపడుతారు. మేం అమెరికాలోని ఫిలాడెల్ఫియా నుంచి శనివారం హైదరాబాద్‌కు రాబోతున్నాం’ అని అన్నారు. మొబైల్ నంబరు కావాలని విజయ్‌ టీం నెటిజన్‌ను కోరింది. దీనికి ఆయన స్పందిస్తూ.. నమ్మలేక పోతున్నానని, ఇది ఎంతో మధురమైన ట్రిప్‌ కాబోతోందని పేర్కొన్నారు.