HomeTelugu Big Storiesబిగ్‌న్యూస్‌: రాజీనామా చేసిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌

బిగ్‌న్యూస్‌: రాజీనామా చేసిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌

2 26మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాత్రికి రాత్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర పడ్నవీస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్‌ పవార్‌ రాజీనామా చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫడణవీస్‌ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. రేపు సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఫడణవీస్‌ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

బలపరీక్షకు ముందే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ వ్యూహాత్మకంగా చక్రం తిప్పారు. కుటుంబసభ్యులతో అజిత్ పవార్‌పై ఒత్తిడి తేవడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఉపముఖ్యమంత్రికి రాజీనామా చేశారు. దీంతో బీజేపీ పరిస్థితి డోలాయమానంలో పడింది. ఈ కారణంగా దేవేంద్ర పడ్నవీస్‌ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.

తాజా పరిణామాల నేపథ్యంలో ఫడణవీస్‌ మీడియా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. ఒక్క బీజేపీనే 105 సీట్లలో గెలిచింది. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమయ్యాం. అయితే శివసేననే అధికారం కోసం బేరసారాలు జరిపింది. ఆ పార్టీ చెబుతున్నట్లుగా మేం ఎలాంటి హామీలు ఇవ్వట్లేదు. శివసేన నిర్ణయం కోసం బీజేపీ వేచి చూసినప్పటికీ.. అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్‌ పవార్‌ బీజేపీకు మద్దతిచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే చివరి నిమిషంలో ఆయన కూడా వెనక్కి తగ్గారు. కూటమిలో కొనసాగలేనని, రాజీనామా చేస్తానని అజిత్‌ చెప్పారు. ఎమ్మెల్యేలను చీల్చలేనని, బేరసారాలకు పాల్పడలేనని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మా దగ్గర సరిపడా సంఖ్యా బలం లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం. అందుకే ముఖ్యమంత్రిపదవికి రాజీనామా చేస్తున్నా. రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పిస్తా. ప్రతిపక్షంలో ఉండి ప్రజా గొంతుక వినిపిస్తా’ అని పడ్నవీస్‌ చెప్పారు.

ఎంత అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారో.. అంతే ఊహించని రీతిలో ఫడణవీస్‌ ఆ పీఠం నుంచి కిందికి దిగారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాలుగురోజుల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మీడియా సమావేశంలో తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వెల్లడించిన ఫడణవీస్‌.. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా లేఖను సమర్పించారు. ఇక తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని.. ప్రజావాణిని వినిపిస్తామని వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!