HomeTelugu Big Storiesతెలంగాణలో తొలి కరోనా మరణం

తెలంగాణలో తొలి కరోనా మరణం

7 26
తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదైంది. హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ ప్రాంతానికి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం ఆ వృద్ధుడి భార్య, కుమారుడిని హోంక్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో మరో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 65 కి చేరిందని మంత్రి ఈటల తెలిపారు.

కుత్బుల్లాపూర్‌కు చెందిన వృద్ధుడు మతపరమైన కార్యక్రమం కోసం ఈ నెల 14న ఢిల్లీ వెళ్లి 17న నగరానికి తిరిగి వచ్చారు. మార్చి 20న వృద్ధుడికి తీవ్ర జ్వరం రావడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో సైఫాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం రాత్రి మరణించాడు. దీంతో సైఫాబాద్‌ పోలీసుల సాయంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వృద్ధుడి నమూనాలను పరీక్షలకు పంపినప్పుడు అతడికి కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు మంత్రి వెల్లడించారు. ఆస్పత్రుల్లో చనిపోయిన వారి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

తెలంగాణలోని మొత్తం కరోనా బాధితులు 65 మందిలో పది మంది కోలుకున్నారని, వారికి పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. వాళ్లను 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని, ఈ నలుగురూ ఎయిర్‌ పోర్టులో స్క్రీనింగ్‌ దగ్గర పనిచేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా హైదరాబాద్‌లో ఎలాంటి రెడ్‌జోన్లూ లేవని మంత్రి స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల నుంచి పనికోసం వచ్చిన కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా వారు పస్తులు ఉండకుండా వారికి ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని ఈటల తెలిపారు. ఇప్పటి వరకూ క్వారంటైన్‌లో 13వేల మంది ఉన్నారని, ఆ సంఖ్య రోజు రోజుకూ తగ్గుతోందని
ఈటల వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!