అందాల పోటీ నుండి ఆర్మీలోకి.!

ఫ్యాషన్‌ ప్రపంచం.. సైన్యం.. ఈ రెండూ భిన్నధ్రువాలు. శారీరక కష్టాన్ని లెక్కచేయకుండా దేశం కోసం అహర్నిశలు సైనికులు కష్టపడితే.. శరీరాన్ని ఎంతో నాజూకుగా కాపాడుకుంటూ ఫ్యాషన్‌ ప్రపంచంలో వెలిగిపోతారు మోడల్స్‌. ఫ్యాషన్‌ ప్రపంచంలోని సుకుమారానికి అలవాటు పడినవారు సైన్యంలో చేరాలనే ఆలోచనే చేయరు. కుదిరితే ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని బాలీవుడ్‌లో స్థిరపడాలనుకుంటారు. కానీ ఫ్యాషన్‌ ప్రపంచంలో అందాల కిరీటాన్ని సొంతం చేసుకొన్న ఒక యువతి మాత్రం వచ్చిన అవకాశాలను తృణప్రాయంగా వదులుకొని దేశం కోసం సైన్యంలో చేరింది. ఆమె పేరు గరిమా యాదవ్‌.

గరిమాయాదవ్‌ చదువులో కూడా చురుకైన అమ్మాయిగా పేరుతెచ్చుకొంది. ఆమె ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కళాశాల నుంచి పట్టా అందుకుంది. ఆ తర్వాత తొలి ప్రయత్నంలోనే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ పరీక్షను పూర్తి చేసింది. దీంతో ఆమెకు చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(ఓటీఏ)లో సీటు వచ్చింది.
అదే సమయంలో ఆమె సరదాగా ‘మిస్‌ ఇండియా ఛార్మింగ్‌ ఫేస్‌ 2017’ పోటీల్లో పాల్గొంది. చదువు, తెలివి, అందం ఈ మూడు కలగలిసిన ఆమెను విజయం వరించింది. ఇటలీలో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. కానీ అందాల పోటీల కోసం ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో వచ్చిన సీటును వదులుకోవడానికి గరిమా యాదవ్‌ ఇష్టపడలేదు. ఆర్మీనే కెరీర్‌గా ఎంచుకొని అకాడమీలో చేరింది. ఇటీవల ఆమె తన శిక్షణ పూర్తి చేసుకొని లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టింది.

‘నేను ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలోకి వచ్చిన తొలినాళ్లలో శిక్షణ స్థాయిని అందుకోవడానికి శరీరం సహకరించలేదు. కానీ నేను ఎక్కడా పట్టువీడలేదు. చివరికి అన్ని ఈవెంట్లలో విజయం సాధించి శిక్షణ పూర్తి చేసుకున్నాను. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు(ఎస్‌ఎస్‌బీ)లో ఎంపికవ్వడానికి శారీరక దృఢత్వానికి సంబంధం లేదు. మీ బలహీనతలను అంగీకరించి నిత్యం మెరుగుపర్చుకునేందుకు కృషి చేస్తే చాలు.’ అని లెఫ్టినెంట్‌ గరిమాయాదవ్‌ శిక్షణ అనంతరం సగర్వంగా వెల్లడించారు.