
చంద్రబాబు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వృద్ధుడైపోయాడు అంటూ గ్రేట్ ఆంధ్ర అనే వెబ్ సైట్ ఓ దిక్కుమాలిన ఆర్టికల్ రాసింది. ఈ సదరు వెబ్ సైట్ నిత్యం జగన్ ప్రత్యర్థి పార్టీల నాయకులు పై ఇలా విషం చిమ్ముతూనే తన పబ్బం గడుపుకుంటుంది. ఇందులో భాగంగానే అన్ని రకాలుగా వృద్ధుడైపోయి తన బలహీనతల్ని బయట పెట్టుకుంటున్న దశలో చంద్రబాబుకి రాజకీయాలు అవసరమా? అంటూ ఒక ఆర్టికల్ రాశారు. విలువలు కలిగిన సమాజానికి జర్నలిజం బాసటగా నిలబడాలి, అవసరమైనప్పుడు బాటలు వేయాలి కూడా. కానీ, ఇలా బాహాటంగానే ఓ నాయకుడి పై విమర్శలు కక్కడం దిగజారిన తనానికి నిదర్శనమే అవుతుంది. అయినా ప్రజలకు కావాల్సింది చంద్రబాబు రిటైర్మెంటు కాదు, తమకు మేలు చేసే పాలన.
అయినా ఇప్పుడు అధికారంలో ఉంది జగన్ ప్రభుత్వం. మరీ ఇప్పుడు కూడా “సైకిల్ పాలన రాకూడదు..సైకిల్ మనకొద్దు” అంటూ గ్రేట్ ఆంధ్ర లాంటి వెబ్ సైట్లు నిత్యం టీడీపీ కి వ్యతిరేకంగా నెగిటివ్ ఆర్టికల్స్ ను ఎందుకు వండి వారుస్తున్నాయి. దీని వల్ల ఆంధ్ర రాష్ట్రానికి గానీ, ఆంధ్రా ప్రజలకు గానీ రూపాయి ఉపయోగం ఉందా ?, మీడియా ఉంది, ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తోంది?, ఏం చేయాలి?, ఎక్కడ అన్యాయం జరుగుతుంది ? అని చెప్పడానికి కదా. ప్రభుత్వం పై న్యాయ పోరాటం చేస్తున్న ప్రత్యర్థి పార్టీల పై ఇలా అర్థంపర్థం లేని రాతలు రాయడానికి మీడియా అవసరం లేదు. కానీ, కోడి కత్తి పార్టీకి అమ్ముడైపోయి అసత్యాలను ఆసక్తికరంగా చెప్పడం ఈ మధ్య గ్రేట్ ఆంధ్ర లాంటి పెయిడ్ సైట్లకు ఆనవాయితీ అయిపోయింది.
ఉదాహరణకు కుప్పం సంఘటన తీసుకుందాం. కుప్పం సంఘటనలో తెదేపా కార్యకర్తలను పోలీసులు కొట్టారు. వారంతా గాయాలతో కుప్పం ఆసుపత్రిలో చేరారు. గురువారం నాడు బాబు వాళ్లని పరామర్శించి.. దైర్యం చెప్పారు. స్వయంగా వారి హాస్పిటల్ బిల్ పే చేసి, వారికి ఆర్థిక సహాయం కూడా చేశారు. ఐతే, ఈ విషయం పై కూడా సదరు వెబ్ సైట్ నీచంగా వార్తలు రాసింది. కుప్పం సంఘటన మొత్తం చంద్రబాబు నడిపించిన రాజకీయ రసవత్తరమైన ఘట్టంగా అభివర్ణించింది. ఎంత దారుణం?, తెదేపా కార్యకర్తలను కొట్టాం అని పోలీసులే చెప్పారు కదా.
పైగా కుప్పం ఆసుపత్రిలో తెదేపా కార్యకర్తలు గాయాలతో జాయిన్ అయినట్టు విజువల్స్ కూడా ఉన్నాయి. బెడ్ల మీద గాయాలై పడి ఉన్న కార్యకర్తలను చూసి చంద్రబాబు ఏమోషనల్ అయ్యారు కూడా. తన వల్ల వీరంతా దెబ్బలు తిన్నారు అని బాబు బాధగా పక్కన ఉన్న వారితో అన్నారు. ఇంత బాధాకరమైన సంఘటనను సదరు వెబ్ సైట్ గ్రేట్ ఆంధ్ర మాత్రం చాలా హీనంగా రాసింది. ‘తెదేపా కార్యకర్తలను పరామర్శిస్తున్న బాబుని కవర్ చేస్తూ స్టిల్స్ తీసారు. ఈ తంతు ముగిసాక బాబు వెళ్లిపోయాడు. ఆయనలా వెళ్లాడో లేదో ఈ కార్యకర్తలు మంచాలు దిగి టకటకా వెళ్లిపోయారు. కాసేపటికి చూస్తే మచ్చుకు ఒక్క పెయిడ్ ఆర్టిస్టైనా, బెడ్ మీద లేడు’ అని గ్రేట్ ఆంధ్ర అనే పచ్చి పెయిడ్ వెబ్ సైట్ రాసింది. దిగజారిపోయి ఇష్టానుసారంగా రాసే వీరి రాతలను ప్రజలే అర్థం చేసుకోవాలి.













