కూకట్‌పల్లి బరిలో సుహాసిని

కూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థిగా దివంగత నేత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరును తెలుగుదేశం ప్రకటించింది. శనివారం ఆమె నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు ఆమెను గురువారం అక్కడికి పిలిపించి మాట్లాడారు. ఆమెను బరిలోకి దింపాలని నిర్ణయించే ముందు హరికృష్ణ తనయులు, సినీనటులు కళ్యాణ్‌రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లతోనూ చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబం నుంచి తెలంగాణ ఎన్నికల్లో ఒకరు పోటీచేస్తే టీడీపీకే కాకుండా మహాకూటమికి సైతం ఊపు వస్తుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ ఏర్పాటైనప్పుడు ఎన్టీఆర్‌ ప్రచార రథ సారథిగా హరికృష్ణ తెలంగాణ అంతటా పర్యటించారు. ఆయనకు అభిమానులు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లిలో సుహాసినికి సానుభూతి లభిస్తుందని టీడీపీ అంచనా. సుహాసిని న్యాయవిద్యలో డిగ్రీ చదివారు. ఆమె మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కోడలు.

కూకట్‌పల్లి టికెట్‌ ఆశించిన ఇతర నేతలను చంద్రబాబు నేరుగా బుజ్జగిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి, కూకట్‌పల్లి కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు, ప్రేమకుమార్‌లు ఈ స్థానాన్ని ఆశించారు. పెద్దిరెడ్డికి గురువారం చంద్రబాబు ఫోన్‌ చేసి ‘కుటుంబ కారణాల వల్ల సుహాసినికి టికెట్‌ ఇవ్వాల్సి వస్తోంది. సహకరించాలి’ అని కోరారు. ‘అయితే మంచిది… మీరే నాకు టికెట్‌ ఇస్తామన్నారు. ఇప్పుడు కుదరదంటున్నారు’ అని పెద్దిరెడ్డి సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. మందడి శ్రీనివాసరావును గురువారం అమరావతికి పిలిపించి చంద్రబాబు అనునయించారు. పార్టీ గెలిచాక అవకాశాలు ఉంటాయని, టీడీపీ గెలుపునకు సహకరించాలని కోరారు.