అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హిడింబ.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తో అశ్విన్ ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.
సిటీలో వరుసగా అమ్మాయిల కిడ్పాప్‌లు జరుగుతుంటాయి. కిడ్పాప్ అయిన అమ్మాయిల ఆచూకిని పోలీసులు కూడా పట్టుకోలేకపోతారు. దీంతో సీఎం, డీజీపీల మీద ఒత్తిడి పెరుగుతుంది. దీంతో స్పెషల్ ఆఫీసర్‌గా ఆద్య (నందితా శ్వేత) వస్తుంది. అప్పటికే కేస్‌ను లీడ్ చేస్తున్న అభయ్ (అశ్విన్ బాబు)ని ఆద్యతో కలిసి పని చేయాల్సిందిగా పై అధికారులు ఆర్డర్ వేస్తారు. ఆద్యతో అభయ్ కలిశాక చేసిన పనులేంటి? అసలు అమ్మాయిల కిడ్నాప్ వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి? మధ్యలో బోయ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అసలు ఈ కథలోకి హిడింబలు ఎలా ఎంట్రీ ఇచ్చారు? ఆ నర మాంస భక్షకులను ఎలా అంతమొందించారు? అనేది కథ.
హిడింబ సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తదే. నరమాంస భక్షకురాలు ప్రస్తుత సమాజంలోకి వస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్ కొత్తగానే ఉంది. దాని కోసం సెటప్ చేసుకున్న థీమ్ కూడా బాగానే ఉంది. కాలాబండను ప్రశాంత్ నీల్ కేజీయఫ్ స్టైల్లో బాగానే డిజైన్ చేసుకున్నాడు. కానీ అంతగా వర్కౌట్ కాలేదు. అసలు ఈ కథను దర్శకుడు ఎలా చెప్పాలనే విషయంలోనే కన్ఫ్యూజ్ అయినట్టుగా, అలాంటి గందరగోళంలోనే సినిమా తీసేసినట్టు అనిపిస్తుంది.
సినిమా చూసే ప్రేక్షకుడి మెదడులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. అసలు ఇది ఎందుకు ఇలా జరిగింది? ఆ టైంలో అలా ఉంటే.. మరి ఈ టైంలో ఇలా ఎందుకు ఉంది? అనే ప్రశ్నలు బోలెడన్న ఎదురవుతాయి. కాన్సెప్ట్ వరకు కొత్తగానే అనిపించినా.. సినిమాగా తెరపై ఎక్కించడంలో దర్శకుడు తడబడ్డాడని ఇట్టే అర్థం అవుతోంది. సగటు ప్రేక్షకుడుకు కూడా ఇలానే అనిపిస్తుంది. సినిమా బాగుందే అని అనుకునేలోపు కొన్ని చిక్కు ప్రశ్నలు మెదడుని తడతాయి. లాజిక్స్ వదిలేసి సినిమాను చూస్తే పర్వాలేదనిపిస్తుంది. మొత్తానికి హిడింబ సినిమాను చూసి బయటకు వచ్చేటప్పుడు క్లైమాక్స్‌లోని ఆ ట్విస్ట్ ఊపిరినిస్తుంది. అయితే ఆ ట్విస్ట్‌ను ప్రేక్షకులు ముందే కనిపెట్టేలా ఉంది. ఆ ఒక్క ట్విస్ట్ సినిమాకు ప్రాణంలా నిలిచే చాన్స్ ఉంది.
ఈ సినిమాలో అభయ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అశ్విన్ బాబు కనిపిస్తాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో సరికొత్త మోడ్‌లో మెప్పిస్తాడు. చివర్లో తనలోని మరో కోణాన్ని కూడా ప్రదర్శిస్తాడు. ఇక నందితా శ్వేత పోలీస్ ఆఫీసర్‌గా మెప్పిస్తుంది. ఇక మార్కండ్ దేశ్‌పాండే నటన, షిజు కారెక్టర్ సినిమాకు ప్రధానంగా నిలుస్తాయి. విలన్‌గా కనిపించిన రాజీవ్ పిళ్లై అంతగా భయపెట్టలేకపోయాడు. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు పర్వాలేదనిపిస్తాయి. ఇక యాక్షన్ సీక్వెన్సులు భారీ స్థాయిలో ఉన్నాయి. విజువల్స్ అద్భుతంగా అనిపిస్తాయి. ఆర్ఆర్ కొన్ని చోట్ల భయపెడితే.. ఇంకొన్ని చోట్ల చిరాకు పుట్టించేలా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
టైటిల్ :హిడింబ
నటీనటులు: అశ్విన్ బాబు,నందితా శ్వేత, రాజీవ్ పిళ్లై, మార్కండ్ దేశ్‌పాండే, రాజీవ్ కనకాల, శుభలేక సుధాకర్ తదితరులు
దర్శకత్వం: అనీల్ కన్నెగంటి
నిర్మాత: గంగపట్నం గంగాధర్
సంగీతం: వికాస్ బాడిస
చివరగా: కొన్ని చోట్ల మాత్రమే మెప్పించిన ‘హిడింబ’