ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్, నేపథ్యం విషయానికి వస్తే.. కోటగిరి శ్రీధర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో అమ్మమ్మ గారింట్లో జన్మించారు శ్రీధర్. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని కామవరపుకోట మండలం తూర్పు యడవల్లి గ్రామం. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కోటగిరి శ్రీధర్ వైజాగ్ గీతం కళాశాల నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. శ్రీధర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రాకముందు పలు వ్యాపారాలు నిర్వహించారు. శ్రీధర్ కుటుంబ నేపథ్యం లోకి వెళ్తే.. ఆయన తండ్రి దివంగత కోటగిరి విద్యాధర రావు మాజీ మంత్రి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు.
ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో పలు కీలకమైన మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వహించారు. నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో కోటగిరి విద్యాధర రావు కూడా ఒకరు. విద్యాధర రావు కుటుంబానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి, దెందులూరు, ఏలూరు మరియు కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతంలో రాజకీయంగా మంచి పట్టు ఉంది. శ్రీధర్ తండ్రి విధ్యాధర రావు తెలుగు దేశం పార్టీలో ఉన్న సమయంలో ఆయన తరపున చింతలపూడి నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. తండ్రి మరణం తమ క్యాడర్ ను, అభిమానులను సమన్వయం చేస్తూ వచ్చారు కోటగిరి శ్రీధర్.
అయితే 2017 లో జగన్ సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకొని, ఏలూరు లోక్ సభ సమన్వయ కర్త గా బాధ్యతలు చేపట్టి, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఏలూరు నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఇంతకీ, రాజకీయ నాయకుడిగా కోటగిరి శ్రీధర్ గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో కోటగిరి శ్రీధర్ పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో కోటగిరి శ్రీధర్ పరిస్థితేంటి ?, మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ కోటగిరి శ్రీధర్ కి ఉందా ?, చూద్దాం రండి. కోటగిరి శ్రీధర్ తాను గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు.
పైగా శ్రీధర్ ఎంపీగా ఉన్నప్పటికీ ఆయనకు వ్యాపారాల మీదే దృష్టి ఎక్కువ ఉంటుంది అని ఏలూరు లోక్ సభ పరిధిలోని ప్రజల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. దీనికితోడు శ్రీధర్ పై పలు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా, ప్రస్తుతం కోటగిరి శ్రీధర్ కి ప్రజల్లో బలమైన ఫాలోయింగ్ ఉంది. ఐతే, కోటగిరి శ్రీధర్ వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే.. గెలిచే పార్టీ వైపు ఉండాలి. జగన్ రెడ్డి పార్టీ నుంచి పోటీ చేస్తే శ్రీధర్ విజయ అవకాశాలు అనుమానంగానే ఉన్నాయి. పర్సనల్ గా కోటగిరి శ్రీధర్ గ్రాఫ్ బాగానే ఉన్నా.. జగన్ రెడ్డి పై ఉన్న వ్యతిరేఖత శ్రీధర్ పై కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి టీడీపీ పార్టీ నుంచి కోటగిరి శ్రీధర్ పోటీ చేస్తే.. గెలిచే ఛాన్స్ ఉంది.