
ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్, నేపథ్యం విషయానికి వస్తే.. ‘వల్లభనేని బాలశౌరి’. చాలా సైలెంట్ పొలిటీషియన్ గా బాలశౌరికి పేరు ఉంది. తనకేం కావాలి ?, తనవాళ్లకు ఏం చేయాలి ? లాంటి వ్యవహారాల గురించి తప్ప, వల్లభనేని బాలశౌరి మిగతా విషయాల జోలికి పోరు. ప్రజా జీవితంలో ఆయన ఆలోచనా విధానం పక్కా లెక్కలతో సాగుతుంది. మరి ప్రస్తుతం ప్రజల్లో వల్లభనేని బాలశౌరి పరిస్థితేంటి ?, వచ్చే ఎన్నికల్లో బాలశౌరి రెడ్డి గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. వల్లభనేని బాలశౌరి ఉమ్మడి గుంటూరు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలోని మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం బాలశౌరి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో ఏంఏ పూర్తి చేశారు.
బాలశౌరి రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార రంగంలో ఉన్నారు. వ్యాపార రంగంలో ఉన్నా రాజకీయాల పట్ల మాత్రం మక్కువ కనబరిచేవారు. 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన బాల శౌరి తెనాలి లోక్ సభ నుంచి పోటీ చేసి, తన సమీప ప్రత్యర్థి మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పై విజయం సాధించారు. 2009 లో నియోజకవర్గాల పునర్విభజన కారణంగా నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం వైఎస్ కుటుంబంతో ఉన్న రాజకీయ సాన్నిహిత్యం కారణంగా బాలశౌరి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఐతే, 2014 లో గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో జగన్ సూచనల మేరకు మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. ఇంతకీ రాజకీయ నాయకుడిగా వల్లభనేని బాలశౌరి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో వల్లభనేని బాలశౌరి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో వల్లభనేని బాలశౌరి పరిస్థితేంటి ?, మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ వల్లభనేని బాలశౌరికి ఉందా ?, ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే లేదు అనే చెప్పాలి.
మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరికి గత కొంత కాలంగా అక్కడి స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిధులతో పొసగడం లేదు. దాంతో ఆయన పై సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత ఉంది. కాబట్టి, వచ్చే ఎన్నికల్లో వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తే.. ఆయనకు వైసీపీ లోకల్ నాయకులు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. దీనికితోడు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో వల్లభనేని బాలశౌరి పై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే, ప్రస్తుత వైసీపీ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సారి వల్లభనేని బాలశౌరికి జగన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇచ్చినా.. వచ్చే ఎన్నికల్లో బాలశౌరి గెలవడం కష్టమే. అంతగా ఆయన గ్రాఫ్ పడిపోయింది.












