Homeపొలిటికల్జగన్ 5 ఏళ్ల టార్గెట్ ఫిక్స్ డ్.. సాగునీటి ప్రాజెక్టుల కోసం లక్ష్య కోట్లు ఖర్చు

జగన్ 5 ఏళ్ల టార్గెట్ ఫిక్స్ డ్.. సాగునీటి ప్రాజెక్టుల కోసం లక్ష్య కోట్లు ఖర్చు

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది పాలనలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల కోసమే ఏపీ సర్కార్ వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఓవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే మరోవైపు ఏపీ ప్రజలకు శాశ్వతంగా లబ్ధి చేకూరేలా జల ప్రాజెక్టులను చేపడుతున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ‘జలయజ్ఞాన్ని’ వైఎస్ జగన్ ఏపీలో ఐదేళ్లలోనే పూర్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

polavaram 1

ప్రాజెక్టుల నిర్మాణంపై ముందుకే..

ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల వల్ల రైతాంగంతోపాటు ప్రతీఒక్కరికి లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు పెండింగ్ ఉన్న ప్రాజెక్టులన్నింటిని తన హయాంలోనే పూర్తి చేయాలనే సంకల్పంతో వైఎస్ జగన్ ముందుకెళుతున్నాడు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయడంతోపాటు కొత్తవాటి కోసం మొత్తం ఐదేళ్లలో కనీసం రూ.96,550కోట్లు వ్యయం చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వాటికోసం రూ. 84,092 కోట్లు వ్యయం చేయాలి. అలాగే కొత్త ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.72,458 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం ప్రణాళిలలు వేసుకుంది. ఈ నిధులు సమీకరణకు అవసరమైన చర్యలను ప్రభుత్వం ఎస్పీవీలు (స్సెషల్ పర్పస్ వెహికిల్) ఏర్పాటు చేస్తోంది.

శరవేగంగా పనులు..

ఏపీలో పోలవరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ ఈ ప్రాజెక్టు పనులను ప్రతిష్టాత్మంగా తీసుకొని పూర్తి చేస్తోంది. ఇప్పటిదాకా మొత్తం ప్రాజెక్టు పనుల్లో 71.46శాతం పనులు పూర్తి కాగా ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ కీలకమైనవి. గత ఆరునెలల కాలంలో 2.80 లక్షల ఘనపు మీటర్ల స్పిల్ వే కాంక్రీట్, స్పిల్ వే ఛానెల్ పనులు జరిగాయి. అదే సమయంలో స్పిల్ ఛానెల్, పవర్ హౌజు, గ్యాప్-1,2,3 లకు సంబంధించిన మట్టి, రాతికట్టి, కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి.

వరదల్లోనూ ఆగని పనులు..

ప్రస్తుతం గోదావరికీ వరదలు ఉన్నప్పటికీ పనులు ఆగకుండా స్పిల్ వే కాంక్రీట్ బ్రిడ్జ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో జల విద్యుత్ ప్రాజెక్ట్ పనులను కొనసాగిస్తున్నారు. వరద తగ్గిన తరువాత అప్పర్, లోయర్ కాఫర్ డ్యాంలతో పాటు స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్లను గ్యాప్-1,2,3 పనులను అధికారులు చేపడుతున్నారు. వీటితోపాటు రాష్ట్రంలో గతంలో చేపట్టిన పనులను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రకాల ప్రాధాన్యతలను నిర్ణయించారు. దీనిలో భాగంగా వచ్చే ఏడాది కొన్ని ప్రాజెక్టులను వినియోగంలోకి తెచ్చేందుకు బడ్జెట్లు కేటాయించగా ఇతర ప్రాజెక్ట్ లను మూడు నుంచి నాలుగేళ్ళ సమయంలో పూర్తి చేయడానికి లక్షాలను నిర్దేశించారు.

నిధులకు ఆటంకం కలుగకుండా ఎస్పీవీ ఏర్పాటు..

రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల పూర్తికి నిధుల కొరత ప్రధాన అవరోధంగా మారుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు ఎస్పీవిలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అందులో ఎస్పీవి-1 కింద రాయలసీమలో కరువు నివారణకు రూ.39,980కోట్లు ఐదేళ్ళలో ఖర్చు చేయనున్నారు. ఎస్పీవి-2 కింద ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్ లు పూర్తిచేయడానికి ఐదేళ్ళలో రూ.8,787కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎస్సీవి-3 కింద ఏపీ రాష్ట్ర నీటి రక్షణ అభివృద్ధి కార్యక్రమం పేరుతో రూ.12,702 కోట్లు ఐదేళ్లలో సమీకరించనున్నారు. ఎస్పీవి-4 పేరుతో పలనాడు కరువు నివారణ కార్యక్రమం ద్వారా ప్రధానంగా గోదావరి, కృష్ణా-పెన్నాల అనుసంధానం కోసం రూ.7,636 కోట్లు, ఎస్పీవి-5 క్రింద కృష్ణా – కొల్లేరు సెలినిటి మిటిగేషన్ కార్యక్రమం ద్వారా రూ.3,356 కోట్లు సమీకరించనున్నారు.

ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..

పెండింగ్ లోని సాగునీటి ప్రాజెక్టులను జగన్ సర్కార్ ప్రాధాన్యతను గుర్తించి పరుగులు పెట్టిస్తోంది. వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టడానికి ప్రణాళికలను రూపొందిస్తుంది. ఇటీవలే సీఎం జగన్‌ పోలవరం, ఉత్తరాంధ్రతోపాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోచేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పరిహారం పెంపుపై రైతులకు అవగాహన..

ఈ క్రమంలో నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం-2, పూల సుబ్బయ్య వెలిగొండ-హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు, వంశధార-నాగావళి లింక్, బీఆర్ఆర్‌ వంశధార ప్రాజెక్టు స్టేజ్‌-2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం కాకుండా పనులు పరుగులు పెట్టించాలన్నారు. చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23టీఎంసీల నీరు నిల్వ చేయాలని, వెంటనే ఆర్అండ్ఆర్‌ ప్యాకేజీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75లక్షల పరిహారం ఇస్తే ప్రస్తుతం రూ.10లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

ప్రణాళికతో ముందుకెళుతున్న ప్రభుత్వం..

నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులో మొదటి సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాగా, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్, కాలువలకు సంబంధించి 71శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇంజనీరింగ్ అధికారులు పనులు చేస్తున్నారు.

ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి..

వంశధార-నాగావళి అనుసంధానం పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. మొత్తం 33.5కి.మీకు గానూ ఇంకా 8.5కి.మీ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆ పనులన్నీ ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం పని చేస్తోంది. వంశధార స్టేజ్‌-2 సంబంధించి రెండోదశ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి, ఒడిషా సీఎంతో చర్చించాల్సి ఉంది.

సాగునీటి ప్రాజెక్టులతో ఏపీ సస్యశ్యామలం..

శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ కోసం 850 కోట్లు వ్యయం ఖర్చు చేయనున్నారు. తారకరామ తీర్థసాగర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టును 2022 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టకున్నారు. వీటితోపాటు ఉత్తరాంధ్రలోని పెండింగ్, కొత్త ప్రాజెక్టులను ఐదేళ్లలోనే పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది.

జగన్ స్పీడు చూస్తుంటే అనుకున్న సమయానికి కంటే ముందుగానే ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గనుక జరిగితే ఏపీ సాగునీటి ప్రాజెక్టులతో సస్యశ్యామలం కావడం ఖాయంగా కన్పిస్తోంది

Recent Articles English

Gallery

Recent Articles Telugu