రాబోయే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళుతున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. 175 నియోజక వర్గాల్లోనూ పోటీచేస్తామని స్పష్టంచేశారు. కేంద్రంపై పోరాటానికి పవన్ కలిసి రావాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో పవన్ ఈ విధంగా స్పందించడం గమనార్హం. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు.
‘175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం. వామపక్షాలతో తప్ప ఎవ్వరితోనూ కలిసి వెళ్లం. యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తాం. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ముక్తకంఠంతో ఖండించండి’ అని ట్విటర్‌లో పవన్ పేర్కొన్నారు. 25 సంవత్సరాల యువత భవిష్యత్ కోసం తాము పనిచేస్తున్నామని, అనుభవజ్ఞులైన వారితో పాటు కొత్తవారికి అవకాశమిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.
బుధవారం సొంత నియోజకవర్గం కుప్పంలో నిర్వహించిన ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశవ్యాప్తంగా ఎవరు కలిసివస్తారో వారిని కలుపుతూ ముందుకు వెళతాం. పవన్‌కల్యాణ్ కూడా మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశారని చెప్పారు. ఆయన వేసిన నిజనిర్ధారణ కమిటీలో రాష్ట్రానికి రూ.70వేల కోట్లు రావాలని తేల్చారు. ఆయన కూడా మాతో కలిసి కేంద్రంపై పోరాటానికి రావాలి’ అని పిలుపునిచ్చారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం నుంచి జిల్లాల వారీగా పార్టీ నాయకులు, అభిమానులతో చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాలతో పొత్తులు ఉండవని స్పష్టంచేశారు.
జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం. వామపక్షాలు తప్ప ఎవరితో కలిసి వెళ్ళము. యువతకు , మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తాం. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ముక్తకంఠంతో ఖండించండి – @PawanKalyan #JSPToContestIn175Constituencies
— JanaSena Party (@JanaSenaParty) January 3, 2019













