మెగాహీరో సినిమాకు ఎన్టీఆర్ క్లాప్!

అరుణాచ‌ల్ క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం ‘జ‌వాన్’. సాయిధ‌ర‌మ్‌తేజ్‌, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, ప్ర‌స‌న్న కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాను కృష్ణ నిర్మిస్తున్నారు. హ‌రీశ్ శంక‌ర్‌.య‌స్ స‌మ‌ర్పిస్తున్నారు. బి.వి.య‌స్‌.ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎన్టీఆర్ క్లాప్‌నిచ్చారు. కొర‌టాల శివ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వినాయ‌క్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫైనాన్షియ‌ర్ స‌త్తె రంగ‌య్య పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.
 
దిల్‌రాజు మాట్లాడుతూ.. ”పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్‌, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ వంటి వ‌రుస విజ‌యాల త‌ర్వ‌త సాయిధ‌ర‌మ్‌తేజ్ చేస్తున్న సినిమా ఇది. భ‌ద్ర‌, మున్నా, ప‌రుగు, మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ చిత్రాల‌కు మా సంస్థ‌లో ప‌నిచేశారు బీవీయ‌స్ ర‌వి. రెండేళ్ల క్రిత‌మే నాకు ఈ లైన్ చెప్పాడు. చాలా బావుంది డెవ‌ల‌ప్ చేయ‌మ‌న్నాను. చేశాడు. క‌థ చాలా బాగా కుదిరింది.  కృష్ణ‌ని నిర్మాత‌ని చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటూ ఉన్నాం. ఇప్ప‌టికి కుదిరింది. . అత‌నికి ఈ సినిమా  పెద్ద స‌క్సెస్ కావాలి. మా సంస్థ నుంచి వచ్చే సినిమా ఎలా ఉంటుందో అలా ఈ సినిమా కూడా ఉండ‌టానికి నావ‌ల్ల వీలైనంత సాయం చేస్తాను. ఇది మిలిట‌రీ క‌థ కాదు” అని అన్నారు.
 
బీవీయ‌స్ ర‌వి మాట్లాడుతూ.. ”జ‌వాన్ అన‌గానే అంద‌రూ ఇది జ‌వాన్ల క‌థ అని అనుకుంటారు. కానీ మా క‌థ అది కాదు. మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడి క‌థ‌. కుటుంబానికి ఓ క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు ఆదుకోవ‌డానికి ఓ కుర్రాడు ఉండాలి. మా హీరో అలాంటి వ్య‌క్తి. ఇంటికొక‌డు అనేది మా సినిమాకు క్యాప్ష‌న్‌. దేశానికి జ‌వాన్ ఎంత ముఖ్య‌మో, ప్ర‌తి ఇంటికి ఇలాంటి ఒక కుర్రాడు ముఖ్యం. పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా ఇది. థ‌మ‌న్ మంచి సంగీతాన్నిచ్చారు,మార్చి నుండి షూటింగ్ జ‌రుపుకుంటాము” అని అన్నారు.
 
థ‌మ‌న్ మాట్లాడుతూ.. ”మంచి సంగీతం కుదిరింది. ఈ చిత్ర నిర్మాత మాకు ఎప్ప‌టి నుంచో తెలుసు. సాయితో మూడో సినిమా ఇది” అని అన్నారు.
 
సాయిధ‌ర‌మ్‌తేజ్ మాట్లాడుతూ.. ”రాజుగారి స‌పోర్ట్ తో ఈ సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ర‌విగారు, కృష్ణ‌గారి కాంబినేష‌న్‌లో చేస్తున్నాను. మంచి క‌థ‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్  చిత్రం. ఎంట‌ర్‌టైనింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది” అని అన్నారు.