రాయల్‌ వశిష్ట ఆపరేషన్ సక్సెస్ .. బోటులో మృతదేహాలు!

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ఎట్టకేలకు బయటకు తీశారు. 38 రోజుల పాటు గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట ఇవాళ బయటకు వచ్చింది. దీంతో ఆపరేషన్ రాయల్ వశిష్ట సక్సెస్ అయ్యింది. బోటు వెలికితీతలో ధర్మాడి సత్యం బృందం కీలకపాత్ర పోషించింది.. డీప్ డైవర్లు నీటి అడుగు భాగం నుంచి మునిగిపోయిన బాటోకు లంగర్లు వేసి.. రోప్‌ సాయంతో బోటును పైకి తెచ్చారు. ఈ ఆపరేషన్ మొత్తం కాకినాడ పోర్టు అధికారికి పర్యవేక్షణలో జరిగింది.

మరోవైపు బోటులో మృతదేహాలు బయటపడుతున్నాయి.. బోటు పూర్తిగా ధ్వంసమైపోగా.. బోటులో దాదాపు ఐదు మృతదేహాల వరకు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అయితే, బోటు పూర్తిగా ఒడ్డుకు చేరితేగానీ.. మృతదేహాలు ఎన్ని ఉన్నాయి అనేది తేలదంటున్నారు. ఇక, మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో.. మృతులు ఎవరనేది గుర్తించడం కష్టంగా మారింది. కాగా, గత నెల 15వ తేదీన కచ్చలూరు దగ్గర గోదావరిలో ఈ బోటు మునిగిపోయింది.. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. 39 మంది మృతిచెందారు. మరికొన్ని మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది.