సమ్మె విరమించేది లేదు.. చర్చలకు సిద్ధం: ఆర్టీసీ జేఏసీ


తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె విరమించబోమని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్ధామ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టులో విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రెండు రోజుల్లో చర్చల ప్రక్రియను ముగించాలని సూచించిందని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో తాము చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేవరకు సమ్మె విరమించే ఆలోచనే లేదని తేల్చిచెప్పారు. సమ్మె యధావిధిగా కొనసాగిస్తామని అన్నారు. ప్రభుత్వం గాని, యాజమాన్యం గాని పిలిస్తే చర్చలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతుందని విమర్శించారు. తదుపరి విచారణ 18న జరగనున్న నేపథ్యంలో ఆరోజు మా తదుపరి వాదనలు వినిపిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలిపాయి.