అఫీషియల్‌.. అమ్మ పాత్ర పోషించనున్న కంగనా రనౌత్‌

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు జయ జీవిత కథకు వెండితెర రూపం ఇచ్చేందుకు ముందుకువస్తున్నారు. ఇప్పటికే నిత్య మీనన్‌ ప్రధాన పాత్రలో ఓ సినిమాను ప్రకటించారు. కేవలం సినిమాగానే కాకుండా వెబ్‌ సిరీస్‌గానూ అమ్మ బయోపిక్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ నిర్మిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో రమ్యకృష్ణ జయలలిత పాత్రలో నటించనున్నారు.

తాజాగా మరో బయోపిక్‌కు సంబంధించి అధికారిక ప్రటకన వెలువడింది. ఎన్టీఆర్‌ బయోపిక్‌కు సహ నిర్మాతలుగా వ్యవహరించిన విబ్రీ మీడియా తలైవి పేరుతో జయలలిత బయోపిక్‌ను నిర్మిస్తున్నారు. ఈబయోపిక్‌లో అమ్మ పాత్రలో కంగనా రనౌత్ నటించనుంది. ఈ విషయాన్ని కంగనా రనౌత్‌ పుట్టిన రోజు సందర్భంగా తమిళ హీరో జీవీ ప్రకాష్ కుమార్‌ అధికారికంగా ప్రకటించారు. విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళంతో పాటు హిందీలోనూ రూపొందిస్తున్నారు.