మెగాహీరోతో మలయాళీ బ్యూటీ!

మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ‘శతమానం భవతి’ చిత్రంతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత తెలుగులో ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ తనకు సూట్ అయ్యే పాత్రలను మాత్రమే ఎన్నుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో రామ్ నటిస్తోన్న ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే నాని, మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో రూపొందనున్న ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పుడు మెగాహీరో సాయి ధరం తేజ్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. 
సాయి ధరం తేజ్, కరుణాకరన్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమను తీసుకోవాలని భావించారు. కరుణాకరన్ నేరేట్ చేసిన కథ నచ్చడంతో అనుపమ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కెఎస్ రామారావు నిర్మించనున్న ఈ సినిమా నవంబర్ నెల నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నారు.