నీలం కళ్లు, రింగుల జట్టు ఉన్నంత మాత్రాన నా కుమారుడైపోడు

బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ కుమారుడు తైమూర్‌ అలీ ఖాన్‌కు ఎంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తైమూర్‌ కోసం సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్‌ పేజీలు ఉన్నాయి. తైమూర్‌ ఎక్కడికి వెళ్లాడు? ఎలాంటి దుస్తులు వేసుకున్నాడు? ఎలాంటి ఆటలు ఆడుతున్నాడు? ఇలా వాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇటీవల కేరళలోని ఓ బొమ్మల షాప్‌లో తైమూర్‌ను పోలి ఉన్న బొమ్మలను రూ.1500లకు అమ్మాకానికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం గురించి తాజాగా కరీనాకపూర్‌ ఓ కార్యక్రమంలో స్పందించారు.

ఓ బొమ్మకు నీలం కళ్లు, రింగుల జట్టు ఉన్నంత మాత్రాన తన కుమారుడైపోడని కాస్త ఘాటుగా స్పందించారు. ‘ఇలా చెబుతున్నందుకు సారీ. తైమూర్‌పై మీడియా నిఘా ఎక్కువగా ఉంది. తైమూర్‌కి ఫొటోగ్రాఫర్ల ఫాలోయింగ్‌ ఎంతగా ఉందంటే.. రేపు ఫొటో తీయకపోతే ఎక్కడ వాడు మీడియా వర్గాలను, మమ్మల్ని కొట్టేస్తారేమోనన్న భయం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇక బొమ్మ విషయానికొస్తే.. నీలం కళ్లు, రింగుల జుట్టు ఉన్నంతమాత్రాన నా కుమారుడైపోడు. మా అబ్బాయిని మీడియా నుంచి దూరంగా ఉంచడానికి మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం. నా కుమారుడిని బయటికి పంపించకుండా, ఆడుకోనివ్వకుండా అదుపుచేయలేను. కానీ తైమూర్‌ ఫొటోలు తీయొద్దని మీడియా వర్గాలకు మాత్రం చెప్పగలను’ అని కరీనా పేర్కొన్నారు.