హీటెక్కిన కరీంనగర్ రాజకీయం.. బీజేపీలోకి గంగుల..?

కరీంనగర్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ చందంగా తయారైంది ప్రస్తుత రాజకీయ పరిస్థితి. అలాంటి నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీజేపీలో చేరబోతున్నారంటూ ఓ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసిన కథనం పొలిటికల్ హీట్ పెంచింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో గంగుల బీజేపీలో నిజంగా చేరుతారా.. టీఆర్ఎస్‌లో ఆయనకొచ్చిన కష్టమేంటనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో స్వయంగా గంగుల రంగంలోకి దిగారు. తన ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. సదరు యూట్యూబ్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

కరీంనగర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తనపై కొందరు కావాలనే కుట్ర పన్నుతున్నారనేది గంగుల వాదన. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు కావాలని ఇలాంటి చీప్ పాలిట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సలహాలు, సూచనలతో పార్టీ పటిష్టత కోసం ఒక సైనికుడిలా పనిచేస్తానే తప్ప ఇతర పార్టీల వైపు చూసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేసే ఇలాంటి వార్తా కథనాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.

ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరించిన గంగుల కమలాకర్ 2009లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. తదనంతర పరిణామాలతో.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్‌లో చేరి మరోసారి 2014లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ క్రమంలో 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి విజయకేతనం ఎగురవేశారు. బీజేపీ నుంచి బరిలో నిలిచిన బండి సంజయ్‌పై 14 వేల పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే వీరిద్దరి మధ్య ఎన్నికల వేళ మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకానొక దశలో నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్‌లో పరస్పర దూషణలకు దిగారు.

CLICK HERE!! For the aha Latest Updates