HomeTelugu Reviewsరివ్యూ: కాష్మోరా

రివ్యూ: కాష్మోరా

నటీనటులు: కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్ తదితరులు..
సంగీతం: సంతోష్ నారాయణన్
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్‌
ఎడిటింగ్‌: వి.జె.సాబు జోసెఫ్‌
విఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌: స్టాలిన్‌ శరవణన్‌, ఇజెనె
నిర్మాతలు: పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్‌.
తమిళ నటుడైనప్పటికీ యుగానికి ఒక్కడు, ఆవారా, ఊపిరి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు
దగరైపోయాడు హీరో కార్తీ. తెలుగు సినిమాలకు డబ్బింగ్ సైతం చెబుతున్న ఈ నటుడు తాజాగా
నటించిన చిత్రం ‘కాష్మోరా’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి
రిజల్ట్ ను అందుకుందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
కాష్మోరా(కార్తీ)దయ్యాలను వదిలిస్తానని చెప్పి జనాల వద్ద డబ్బు వసూలు చేస్తూ.. స్వామీజీగా
ఫేమస్ అయిపోతాడు. అతడు నిజమైన స్వామి కాదని మాయగాడని నిరూపించడానికి
యామినీ(శ్రీదివ్య) అనే అమ్మాయి ప్రయత్నిస్తుంది. వూర్లో ఉండే పోలీసులు, మంత్రులు కూడా
కాష్మోరాను స్వామీజీగా నమ్ముతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు కాష్మోరా దగ్గరకు
చిదంబరం అనే వృద్దుడు వచ్చి తన బంగ్లాలో దయ్యాలున్నాయని వాటిని వదిలిస్తే ఎంత
డబ్బైనా.. ఇస్తానని చెబుతాడు. దీంతో కాష్మోరా ఆ బంగ్లా దగ్గరకు వెళ్తాడు. అక్కడ కాష్మోరాను
నిజంగానే కొన్ని దయ్యాలు భయపెడతాయి. అక్కడ నుండి తనను వెళ్లనివ్వకుండా చేస్తాయి.
కాష్మోరా కుటుంబ సభ్యులను కూడా ఆ బంగ్లాకు వచ్చేలా చేస్తాయి. ఏం జరుగుతుందో..
తెలియని స్థితిలో ఉన్న కాష్మోరాకు రాజనాయక్(కార్తీ) అనే ప్రేతాత్మ కనిపించి మూడు రోజుల్లో
రాబోయే నవకాలిక పౌర్ణమి నాడు పూజలు చేయాలని చెబుతాడు. ఎటూ వెళ్ళలేని పరిస్థితుల్లో
ఉన్న కాష్మోరా దానికి అంగీకరిస్తాడు. అసలు రాజానాయక్ ప్రేతాత్మ కాష్మోరాను ఎన్నుకోవడానికి
కారణం ఏంటి..? తనతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా ఎందుకు రప్పించాడు..? అసలు
రాజనాయక్ ప్రేతాత్మగా మారడానికి గల కారణలేంటి..? నయనతార పాత్ర ఎలా ఉండబోతోంది..?
అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
ప్లస్ పాయింట్స్:
కథ, కథనం
విజువల్ ఎఫెక్ట్స్
కామెడీ
కార్తీ, నయనతార
మైనస్ పాయింట్స్:
సంగీతం
ఎడిటింగ్
విశ్లేషణ:
మూస ధోరణిలో నడుస్తున్న సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే కొత్త కథలు వస్తున్నాయి.
అందులో కాష్మోరా కూడా ఒకటి. మంచి కథను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా చెప్పడంలో
దర్శకుడు గోకులు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రస్తుతం బయట కూడా చాలా మంది వేషాలు
వేసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. అటువంటి కాన్సెప్ట్ కు 800 సంవత్సరాల క్రితం
జరిగిన ఓ కథను జోడించి తెరపై చక్కగా ఆవిష్కరించగలిగారు. ఈ సినిమాకు మెయిన్ అసెట్
కార్తీ.. తన నటన. రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఒదిగిపోయాడు. కాష్మోరా పాత్రలో ప్రేక్షకులను
తన కామెడీతో ఎంటర్టైన్ చేస్తూనే.. రాజనాయక్ అనే వికృతి చేష్టలు చేసే సైనికుడిగా బాగా
నటించాడు. రత్న మహాదేవిగా నయనతార తనదైన రీతిలో నటించింది. కత్తి పట్టి ఫైట్ చేసే
సన్నివేశాల్లో నిజమైన రాణిగా కనిపించింది. తన కాస్ట్యూమ్స్ కూడా అందంగా ఉన్నాయి.
శ్రీదివ్య పాత్ర చెప్పుకోదగిన విధంగా లేకపోయినా.. ఉన్నంతలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
వివేక్ తన కామెడీతో మెప్పించాడు. ఇటువంటి కథలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ముఖ్యం.
అయితే ఈ సినిమాకు అదే మైనస్ గా మారింది. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోవు. సినిమా
మొదటి భాగం మొత్తం కామెడీతో నడిచి రెండో భాగంలో కథలోకి వెళ్తారు. రాజ్యాల ఎపిసోడ్స్
కాస్త ల్యాగ్ అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ ఇరవై నిమిషాలు మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది.
రత్నమహాదేవికి, రాజనాయక్ కు మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. నిడివి
తగ్గించి ఉంటే సినిమా ఇంకా బావుండేది. విజువల్ గా సినిమాను హై స్టాండర్డ్స్ లో తీయడానికి
ప్రయత్నించారు. గ్రాఫిక్స్ షాట్స్ ఆకట్టుకుంటాయి. సాధారణ ప్రేక్షకుడికి గ్రాఫిక్స్ అనే ఫీలింగ్
కలగకుండా చేశారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను
అలరించడం ఖాయం.

రేటింగ్: 3/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu