దేశ రాజకీయాల్లో అద్భుతమైన మార్పు తెస్తా: కేసీఆర్‌

శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనానికి తెలంగాణ ప్రజలు ఎంతగానో సహకరించారని, ఈ ఎన్నికల్లో తమకు లభించిన ఘన విజయం ప్రజలదేనని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీలు.. కులాలు, మతాలకతీతంగా నిండుగా దీవించి తమకు ఈ విజయాన్ని అందించారన్నారు. తమకు ఈ గొప్ప విజయం అందించిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో జరిగిన ఎన్నికలు యావత్‌ దేశానికి ఓ మార్గాన్ని చూపాయని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తామన్నారు. తాను ఎన్నికల బహిరంగ సభల్లో చెప్పినట్టుగానే కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు తమ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ..

‘టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు శ్రేణులందరూ అహోరాత్రులు కష్టపడి పనిచేయడం వల్లే గొప్ప విజయం సాధించాం. తొలి నుంచి అనుకున్నట్టుగానే అణుకువ, వినయం, విధేయత అవసరం. విజయంతో గర్వం, అహంకారం రావాల్సిన అవసరం లేదు. కర్తవ్య నిష్ఠతో బాధ్యతల్ని నిర్వహించడం పైనే మనం దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొత్త రాష్ట్రాన్ని ఓ బాటలో పెట్టాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. కోటి ఎకరాలు పచ్చబడాలనే లక్ష్యంలో ఏమాత్రం రాజీలేదు. అది జరిగి తీరాల్సిందే. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కాళేశ్వరం.. కూటమిని గెలిపిస్తే శనీశ్వరం అని ఎన్నికల ప్రచార సభల్లో అన్నాను. ఏది కావాలో తేల్చుకోవాలని ప్రజలకు చెప్పాను. కచ్చితంగా తమకు కాళేశ్వరం కావాలనే ప్రజలు తీర్పు ఇచ్చారు. దాంతో పాటు మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరు తెచ్చి తీరుతాం. ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాం.’

‘రైతుల కోసం కచ్చితంగా పనిచేస్తాం. వారికి ఏ బాధా లేకుండా చేస్తాం. గిరిజనులు, గిరిజనేతరుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపేలా పనిచేస్తాం. నేనే వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటా. బీడీ కార్మికులు, గీత కార్మికులు, కుల వృత్తులన్నీ కుదుటపడాలి. వారికి ఆధునిక యంత్రాలను ఇచ్చి ఆదుకుంటాం. యువతకు ఉపాధి, ఉద్యోగాలు విరివిగా లభించేలా పనిచేస్తాం. తమకు అవకాశాలు రావడంలేదనే బాధ వారిలో ఉంది. నిరుద్యోగ సమస్య దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ఉంది. దీన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటాం. ఉద్యోగ ఖాళీలను కచ్చితంగా భర్తీ చేస్తాం. ఎలాంటి అనుమానాలు యువతకు అక్కర్లేదు. ప్రభుత్వేతర రంగాలో ఉపాధి విరివిగా లభించేలా చర్యలు తీసుకుంటాం. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉంది. సస్యశ్యామలమైన తెలంగాణ, శాంతియుతమైన తెలంగాణ, సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా మేం పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. దళితులు దశాబ్దాలుగా పేదరికంలో కూరుకుపోవడం రాచపుండులా క్షోభపెడుతోంది. దానికి భరతవాక్యం పలకాలి. కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ వేశాం. దానిపై పనిచేస్తున్నాం.’

సింగిల్‌ బూత్‌లోకూడా రీపోల్‌ లేకుండా, ఎలాంటి దొమ్మీలు లేకుండా యావత్‌ దేశానికే ఓ మార్గం చూపే విధంగా ఎన్నికలు నిర్వహించుకోగల్గడం అందరం గర్వపడాల్సిన విషయం. శాంతిభద్రతల నిర్వహణ అంశంలో ఎక్కడా రాజీ లేకుండా పోలీసులు, ఈసీ అధికారులు పనిచేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రజత్‌కుమార్‌కు ధన్యవాదాలు. మీడియా కూడా మంచి పాత్ర పోషించింది. రాష్ట్రంలో మీడియా గౌరవప్రదంగా ప్రవర్తించింది.’

‘దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రేక్షక పాత్ర పోషించం. చైతన్యం కల్గినది తెలంగాణ గడ్డ. తానేంటో నిరూపించుకున్న భూమి తెలంగాణ. 116 సభల్లో నేను పాల్గొన్నా. ప్రతి సమావేశంలో నేను ప్రజలకు విజ్ఞప్తి చేశాను. పార్టీలు, నాయకులు కాదు. ప్రజలే గెలవాలని అన్నాను. ఈ రోజు ప్రజలే గెలిచారు. ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసినా మేం పట్టించుకోలేదు. ప్రధాని దగ్గర నుంచి అనేకమంది పెద్దలు వచ్చి ఎన్నికల ప్రచారం చేశారు. అంతిమ తీర్పు ప్రజలు ఇచ్చారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఓ దిక్సూచి తెలంగాణ. జాతీయ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం ఇస్తాం. దేశంలో పెద్ద గందరగోళం ఉంది. నూరు శాతం బీజేపీయేతర, కాంగ్రెసేతర పరిపాలన రావాలి. మాకు ఎవరూ బాస్‌లు లేరు. మేం ఎవరికీ ఏజెంట్లం కాం. ప్రజలకే ఏజెంట్లం. ప్రజలే మమ్మల్ని ఏజెంట్లుగా నియమించారు. వారి కోసమే మేం పనిచేస్తాం. మేమెవరికీ గులాంగిరీ చేయం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ.. జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాం’అని కేసీఆర్‌ అన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates