Homeతెలుగు Newsకాంగ్రెస్‌, బీజేపీలపై మండిపడ్డ కేసీఆర్‌

కాంగ్రెస్‌, బీజేపీలపై మండిపడ్డ కేసీఆర్‌

14 2కాంగ్రెస్‌, బీజేపీలు రాష్ట్రాలపై కర్రపెత్తనం చెలాయించాలని చూస్తున్నాయని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ముస్లిం, గిరిజనుల జనాభా పెరిగిందని, దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ అసెంబ్లీ, కేబినెట్‌లో తీర్మానం చేసి ఢిల్లీకి పంపితే దాన్ని ప్రధాని పెండింగ్‌లో ఉంచారని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన బీజేపీ, కాంగ్రెస్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

‘తెలంగాణలో ముస్లిం జనాభా ఎక్కువ. ఏపీలో తక్కువ. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఆదివాసీలు, లంబాడీల జనాభా పెరిగింది. వారికి రిజర్వేషన్లు పెరగాలి కదా. రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ, కేబినెట్‌లో తీర్మానం ఆమోదించాం. ఢిల్లీకి వెళ్లి అందజేయడమే కాకుండా 30 ఉత్తరాలు కేంద్రానికి రాశాం. అంతేకాకుండా మంత్రులం వెళ్లి మోడీని కలిసి విజ్ఞప్తి చేశాం. చెయ్యరు. చేయనీయబోమని ఇంకా ఉల్టా మాట్లాడుతున్నారు. ఇండియా ఏమైనా మీ తాత తండ్రుల జాగీరా? ఇది ప్రజాస్వామ్యం. ఇన్ని రోజులూ మీ కాలం నడిచింది. రాష్ట్రాలకు సంపూర్ణ న్యాయం జరగాలంటే కచ్చితంగా ఢీల్లీలోని బీజేపీ, కాంగ్రెస్‌లేని ఫెడరల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి రావాలి. అది జరగాలంటే రాష్ట్రంలో 17మంది ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్‌నే కైవసం చేసుకోవాలి.’

‘హైదరాబాద్‌ నుంచి అసదుద్దీన్‌ కచ్చితంగా గెలుస్తాడు. మేం మిత్రపక్షాలం. 16 ఎంపీ సీట్లు టీఆర్‌ఎస్‌ గెలవాలి. దేశంలో అనేక పార్టీలు మాతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ పార్టీల నేతలతో నేను మాట్లాడాను. ఢిల్లీపై కాంగ్రెస్‌ వాసన, బీజేపీ వాసన లేని ప్రభుత్వ జెండాను పాతాలి. రాష్ట్రాలకు అధికారాలు రావాలి. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా.. అన్నింటిపైనా కేంద్రానిదే పెత్తనం. అధికారం బదలాయించమంటే బదలాయించరు. కేంద్రం అధికారాలను తమ గుప్పిట్లో పెట్టుకుంటోంది. చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తోంది. రాష్ట్రాలపై కాంగ్రెస్‌, బీజేపీ కర్రపెత్తనం, ఫ్యూడల్‌ పాలన పోవాలంటే కచ్చితంగా కేంద్రంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ రావాలి. రాష్ట్రాలు శాసించే ప్రభుత్వం కేంద్రంలో రావాలి. అందుకోసం ప్రజలంతా సిద్ధంకావాలి’ కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యంలో వ్యక్తులు, పార్టీలు గెలవడం ముఖ్యం కాదు. నిజంగా పరిణతి ఉన్న ప్రజాస్వామ్యమైతే ప్రజలే గెలవాలి. ప్రజలు కోరుకున్నవారు చట్టసభలకు వెళ్తే ప్రజల కోరికలు నెరవేరుతాయి. రూ.1000ల పింఛను వస్తుందని చరిత్రలో ఏనాడైనా అనుకున్నామా? భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా? రాహుల్‌ గాంధీ, తోక గాంధీ, తొండెం గాంధీ, నిన్న నరేంద్ర మోడీ అడ్డంగా మాట్లాడుతున్నారు. మాటలు చెప్పమంటే నేనూ అనేక కబుర్లు చెబుతాను. తప్పులు ఉంటే విమర్శలు చేయొచ్చు. సర్దుకుంటాం. కాంగ్రెస్‌ పాలించే రాష్ట్రంలో ఒక్కచోటైనా రూ.1000 పింఛను ఉందా? భారతదేశంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కదా.. ఎక్కడైనా రూ.1000 పింఛను ఇవ్వగలరా మీరు. వికలాంగులకు రూ.1500 పింఛను ఎక్కడైనా ఉందా? రైతు బంధు పథకం వస్తుందని జిందగీలో అనుకున్నామా? సమైక్య పాలనలో చితికిపోయిన రైతులను బాగుచేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంకల్పించింది.’

‘కాల్వల గట్ల వద్ద, లిఫ్టుల వద్ద మన మంత్రులు నిద్రపోయి నీళ్ల కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారు. 24గంటల పాటు విద్యుత్‌ ఇస్తున్నాం. ప్రజలు మేం చేసిన పనులు గుర్తించాలి. రైతు బీమా కల్పిస్తున్నాం. కష్టపడి తెలంగాణ తెచ్చాం. ముస్లింలు, గిరిజనుల గురించి పనిచేస్తున్నాం. దళితులు, బీసీల కోసం రెసిడెన్షియల్‌ పాఠశాలలు పెట్టుకుంటున్నాం. మిషన్‌ భగీరథ ద్వారా మంచినీళ్లు తెచ్చుకుంటున్నాం. అన్నీ ప్రజల కళ్లముందు ఉన్నాయి. కాంగ్రెస్‌కు నాతో కొట్లాడటం చేతకావడంలేదు. ఆంధ్రాకు పోయి చంద్రబాబును తీసుకొస్తున్నారు. స్వతంత్ర తెలంగాణలో ఇంకా చంద్రబాబు పెత్తనం అవసరమా? ఆంధ్రోళ్ల పెత్తనం అవసరమా? తాగునీరు, వ్యవసాయానికి నీరు తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నా కేసులు వేస్తున్నారు. చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాలకు ప్రతినిమిషం అడ్డంపడే వ్యక్తి. ఆయన మన ఇంటికి వచ్చి కొడతానంటున్నారు. పడదామా.. ఉల్టా కొడదామా? ఓటుతో కొట్టి రాజకీయ చైతన్యం చాటుకోవాలి’ అని ప్రజలకు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu