మోడీకు కేసీఆర్‌ సవాల్‌

నిజామాబాద్‌ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ తనపై అనవసర విమర్శలు చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. నిజామాబాద్‌లో తాగునీరు, విద్యుత్‌ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా? అని ప్రశ్నించారు. దమ్ముంటే మోడీ రావాలి.. నిజామాబాద్‌లో తేల్చుకుందాం అని సవాల్‌ విసిరారు. మోడీ రమ్మంటే తాను మహబూబ్‌నగర్‌ నుంచి హెలికాఫ్టర్‌లో నిజామాబాద్‌కు వస్తానని, ఎక్కడ సమస్య ఉందో ప్రజలముందే తేల్చుకుందామన్నారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌లో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో మాట్లాడారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, ఎవరికీ భయపడబోనన్నారు. మోడీకి ఎవరు స్క్రిప్ట్‌ రాసిచ్చారో గాని ఆయనంత తెలివితక్కువ ప్రధానిని చూడలేదని వ్యాఖ్యానించారు. ఆర్థిక క్రమశిక్షణతో తెలంగాణలో సంపద పెంచామని తెలిపారు.

గత పాలకుల పాలన, టీఆర్‌ఎస్‌ పాలనను పోల్చి చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేదలు, మధ్య తరగతి ప్రజల గురించి గత ప్రభుత్వాలు ఆలోచించలేదన్నారు. ఎవరి పాలన ఎలా ఉందో మీ కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. ఇందిరమ్మ బకాయిలను తాము అధికారంలోకి వచ్చాక చెల్లించామని గుర్తుచేశారు. మేము ఉచితంగా రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పాలమూరు ప్రజలపై ఉందన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు లేఖలు రాశారని, అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్‌ పార్టీ జట్టుకట్టిందని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌లో టీడీపీ అభ్యర్థికి డిపాజిట్లు రాకుండా చేయాలని పిలుపునిచ్చారు. వలసాధిపత్యం తమపై చెల్లదన్నారు. తెలంగాణపై చంద్రబాబు పెత్తనం అవసరమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సంక్షేమం దెబ్బతింటుందన్నారు. కాంగ్రెసోళ్లకు విద్యుత్‌ ఇవ్వడం చేతకాదని మండిపడ్డారు.