నన్ను చూస్తే కాంగ్రెస్‌, బీజేపీలకు వణుకు: కేసీఆర్‌

కాంగ్రెస్‌, బీజేపీలు కేంద్రంలో ఉంటూ రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తున్నాయని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో రావాలన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడే ప్రభుత్వం రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందుకోసమే తాను యుద్ధం ప్రారంభించానని, కేసీఆర్‌ను చూస్తే కాంగ్రెస్‌, బీజేపీకు వణుకన్నారు. అందుకే పాలనపై అబద్ధాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ప్రజాకూటమి, టీఆర్‌ఎస్‌ మధ్యేనని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. దాదాపు 58 ఏళ్లు పాలించిన టీడీపీ, కాంగ్రెస్‌ ఓవైపు, 15 ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణలో నాలుగేళ్లు పాలించిన టీఆర్‌ఎస్‌ మరో వైపు ఉన్నాయన్నారు. ఎవరికి ఓటు వేసి గెలిపించాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. ప్రజల దీవెనలతో నాలుగేళ్ల పాటు మంచి పాలన అందించామన్నారు. ప్రజలు అయోమయానికి గురికాకుండా మంచి పార్టీని ఎన్నుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చాక అనేక ప్రణాళికలతో తెలంగాణలో కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు. సిర్పూర్‌ పేపర్‌ మిల్లు ఎవరి హయాంలో మూతపడిందో అంతా ఆలోచించాలన్నారు. కాంగ్రెస్‌ అడ్డగోలు విమర్శలను చూడలేకే తాము ఎన్నికలకు వెళ్లామని, అమలవుతున్న సంక్షేమ పథకాలు ఆగకూడదనే ఎన్నికలకు వెళ్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర సంపద ఎంతమేర పెరుగుతుందో అందుకనుగుణంగా ప్రజలకు పంచుతున్నామన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాల హయాంలో విద్యుత్తు‌ కోసం అనేక ఇబ్బందులు పడ్డామని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని, లేకపోతే ఆగమవుతామని అన్నారు. తెలంగాణలో కరెంట్‌ లేదని ప్రధాని మోడీ చేసిన విమర్శలు వాస్తవం కాదన్నారు. తాము ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తేనే రాష్ట్రంలో 24గంటల పాటు విద్యుత్తు‌ను అందించగల్గుతున్నామన్నారు. వ్యవసాయంలోని కష్టనష్టాలేంటో తనకు బాగా తెలుసన్న కేసీఆర్‌.. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు. మరికొన్ని రోజుల్లో మిషన్‌ భగీరథ నీటిని కాగజ్‌నగర్‌ నియోజకవర్గానికి అందిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు, గిరిజనుల జనాభా శాతం పెరిగింది. గతంలోనే ముస్లిం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, కేంద్రం మెడ వంచైనా రిజర్వేషన్లు సాధించుకుందామని అన్నారు. కల్యాణలక్ష్మీ పథకానికి కులం, మతంతో సంబంధంలేదని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందరికీ అమలుచేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మళ్లీ విద్యుత్తు‌ కష్టాలు మొదలవుతాయని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలన్నారు. కాగజ్‌నగర్‌లో తెరాస అభ్యర్థి కోనప్పను గెలిపిస్తే ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదన్నారు.