బోనీ కపూర్‌ చిత్రంలో కీర్తి సురేశ్‌?

హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారట. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మించబోయే చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘బదాయి హో’ అనే సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకున్న అమిత్‌ శర్మ.. ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. అయితే దీనిపై కీర్తి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ప్రాజెక్ట్‌ గురించి త్వరలో బోనీ కపూర్‌ స్వయంగా ప్రకటిస్తారని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎ.ఆర్.‌ మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సర్కార్‌’ సినిమాతో కీర్తి వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత ఆమె నుంచి కొత్త సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రకటన రాలేదు. మరోపక్క సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జోడీగా నటించే అవకాశం దక్కించుకున్నట్లు గతంలో సినీ విశ్లేషకులు స్పష్టం చేశారు. ఎ.ఆర్‌. మురుగదాస్‌ తెరకెక్కించబోయే ఈ చిత్రంలో నయనతారతో పాటు కీర్తి సురేశ్ కూడా హీరోయిన్‌గా నటించనున్నారు. మలయాళీ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌తోనూ ఓ చిత్రంలో నటించనున్నారు ‘మహానటి’.