Homeతెలుగు Newsకేటీఆర్ ట్వీట్‌పై లగడపాటి కౌంటర్‌

కేటీఆర్ ట్వీట్‌పై లగడపాటి కౌంటర్‌

5 4తెలంగాణ ప్రజలు ప్రజాకూటమి పక్షాన ఉన్నారంటూ మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించిన లగడపాటి రాజగోపాల్‌ సర్వేలో కుట్ర ఉందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఇదే లగడపాటి రాజగోపాల్ గత నెలలో టీఆర్‌ఎస్‌కు 65 నుంచి 70 సీట్లు వస్తాయని తనకు మెసేజ్ చేశారని.. చంద్రబాబు ఒత్తిడితో ఇప్పుడు సర్వేను మార్చి కొత్త కథ చెబుతున్నారని కేటీఆర్ ఆరోపిస్తూ ట్వీట్‌ చేశారు. ఆ స్ర్కీన్‌షాట్లను షేర్‌ చేశారు. కేవలం చంద్రబాబు కుట్రను ప్రజలకు తెలియజేసేందుకే లగడపాటి తనకు పంపిన మెసేజ్‌ను షేర్ చేయాల్సి వస్తోందని కేటీఆర్ చెప్పారు. సర్వే పేరుతో తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు లగడపాటి రాజగోపాల్ ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

కేటీఆర్‌ ఆరోపణలపై లగడపాటి మరోసారి బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎవరో ఒత్తిడితో నా సర్వే మార్చానని కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఒకరు ఒత్తిడి చేస్తే సర్వేలు మార్చే వ్యక్తిని కాదు. నాకు పదవులు కన్నా వ్యక్తిత్వం ముఖ్యం. సెప్టెంబర్‌ 15 లేదా 16న కేటీఆర్‌ నా సమీప బంధువుల ఇంట్లో కలిశారు. అప్పట్లో ఎన్నికల విషయంలో నా సాయం కోరారు. దీంతో ఎమ్మెల్యేలను మార్చకపోతే ప్రమాదం ఉందని నాకున్న రాజకీయ అనుభవంతో ఆ తర్వాత ఆయనకు సూచనలు చేశా. వారిని మారిస్తే మంచిదని చెప్పా. అరెస్టులు చేయించడం మంచిది కాదని కూడా సూచించా. చంద్రబాబును కలుపుకొని వెళితే మంచిదని చెప్పా. కాని ఒంటరిగానే వెళతామని బదులు ఇచ్చారు. మంచి సలహాలు, సూచనలు చేశారని నాకు మెసేజ్‌ పెట్టారు అని లగడపాటి వివరించారు.

నవంబర్‌ 11 తేదీ నాటికి 37 మంది అభ్యర్థుల విషయంలో సర్వే చేయగా.. కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యం ఉందని.. ఈ విషయాన్ని అప్పట్లో కేటీఆర్‌కు మెసేజ్‌ పెట్టానని లగడపాటి వివరించారు.. పోటా పోటీగా ఉన్నప్పుడు అభ్యర్థులే ప్రధానం అవుతారని కూడా చెప్పానని తెలిపారు. మళ్లీ నవంబర్‌ 20న మరోసారి మెసేజ్‌ పెట్టానని, అప్పటికీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం చూసి టీఆర్‌ఎస్‌కు 65 నుంచి 70 స్థానాలు వస్తాయని చెప్పినట్లు లగడపాటి వెల్లడించారు. టీఆర్‌ఎస్‌కు 35 నుంచి 40 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేయగా దీనిపై కేటీఆర్‌ స్పందించి దానికంటే ఎక్కువే వస్తాయని కేటీఆర్ తనకు బదులిచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రజల ఆలోచనలో మార్పులు రావడం, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి తదితర హామీల విషయంలో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. కూటమి కట్టకముందు టీడీపీకి ఉన్న 20 శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కు వెళ్లాయి. కూటమి ఏర్పాటు తర్వాత ఆ ఓట్లు తిరిగి ప్రజాకూటమికి మళ్లాయి. ఈ ఉదయం కూడా మళ్లీ సమాచారం వచ్చింది. వరంగల్‌ జిల్లాలోనూ కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉందని లగడపాటి వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!