తెలంగాణలో హస్తానికే చాన్స్: లగడపాటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 7న జరగనున్న నేపథ్యంలో లగడపాటి తన సర్వేలోని మరో ముగ్గురు గెలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఇప్పటికే నారాయణపేట్‌, బోథ్ నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని ప్రకటించిన లగడపాటి మంగళవారం మరో ముగ్గురి పేర్లు వెల్లడించారు. పూర్తి వివరాలు పోలింగ్ రోజు సాయంత్రం వెల్లడిస్తానని తెలిపారు. ఇబ్రహీంపట్నం, మక్తల్‌, బెల్లంపల్లిలో స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారని తెలిపారు.

తెలంగాణలో ప్రస్తుతం ప్రజానాడి కాంగ్రెస్‌ కూటమివైపే ఉందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెలిపారు. గత ఎన్నికల్లో పోలింగ్‌ శాతం 68.5గా నమోదైందని, అంతకుమించి నమోదైతే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌కు విజయావకాశాలు ఎక్కువని తెలిపారు. పోలింగ్‌ శాతం తగ్గితే మాత్రం హంగ్‌ ఏర్పడే అవకాశముందని అన్నారు. పోలింగ్‌ శాతాన్ని బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నారు. పోలింగ్‌ పెరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని భావించాలన్నారు. గత ఎన్నికల్లోలాగానే 68.5 పోలింగ్‌ శాతం నమోదయితే ఎవరికి లబ్ధి చేకూరుతుందో ఆ వివరాలను 7వ తేదీసాయంత్రం 5 గంటల తర్వాత వెల్లడిస్తానని లగడపాటి చెప్పారు.

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజాకూటమి ఆధిక్యంలో ఉందని.. ఉమ్మడి వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యం కనిపిస్తోందని.. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మాత్రం హోరాహోరీ పోటీ ఉంటుందని లగడపాటి తెలిపారు. గతం కన్నా బీజేపీకి ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని, ఆ పార్టీ గ్రేటర్‌ పరిధిలోనే కాక, జిల్లాల్లోనూ కొన్ని స్థానాల్లో గెలిచే అవకాశముందని చెప్పారు. హైదరాబాద్‌లో ఎంఐఎం బలంగా ఉందని, 7 స్థానాలు దక్కించుకుంటుందని, మిగతా సీట్లను బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు పంచుకుంటాయని పేర్కొన్నారు. అందరూ ముందు నుంచి అనుకున్నట్టుగా తెలంగాణలో ఎన్నికలు ఏకపక్షంగా మాత్రం జరగడం లేదని తెలిపారు.

ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థి జలంధర్‌ రెడ్డి, బెల్లంపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థి జి.వినోద్‌ గెలుస్తారని లగడపాటి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో శివకుమార్‌ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్‌ బోథ్‌ నుంచి జాదవ్‌ అనిల్‌ కుమార్‌ గెలుస్తారని కొద్దిరోజుల క్రితమే ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకూ ఆయన.. ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న ఐదుగురు స్వతంత్ర అభ్యర్థుల పేర్లను వెల్లడించినట్టయింది. మిగతా ముగ్గురి పేర్లు వెల్లడించాలనే ఉన్నా, అక్కడ తన మిత్రులు పోటీలో ఉన్నందున వారి విజ్ఞప్తి మేరకు ఆ పేర్లను ఇప్పుడు ప్రకటించడం లేదన్నారు.