సింగపూర్‌ నుంచి తరలివస్తున్న మహేశ్‌ విగ్రహాం.. అభిమానులు సెల్ఫీ దిగొచ్చు

సింగపూర్‌లోని ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుసాడ్స్‌లోని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు మైనపు విగ్రహాన్ని హైదరాబాద్‌ తరలిస్తున్నారు. అభిమానుల కోసం మార్చి 25న గచ్చిబౌలిలోని ఏఎమ్‌బీ మల్టీప్లెక్సులో దీన్ని ప్రదర్శనకు ఉంచబోతున్నారు. మహేశ్‌ విగ్రహాన్ని లాంచ్‌ చేయబోతున్నారు. ఒక్క రోజుపాటు విగ్రహం ఇక్కడే ప్రదర్శన నిమిత్తం ఉంటుంది. తిరిగి మ్యూజియం సిబ్బంది విగ్రహాన్ని సింగపూర్‌కు తీసుకెళ్తారు. మేడమ్‌ టుసాడ్స్‌ సింగపూర్‌లో తప్పా మరోచోట ఇంత ఘనంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదని, ఇదే తొలిసారని చెబుతున్నారు.

మహేశ్‌ విగ్రహం హైదరాబాద్‌ రాబోతోందని తొలుత నిర్వాహకులు ప్రకటించినప్పుడు విశేషమైన స్పందన వచ్చింది. కార్యక్రమంలో మేం కూడా పాల్గొంటామని అభిమానులు పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో సందేశాలు పంపారు. ఈ నేపథ్యంలో మహేశ్‌ బృందం, టుసాడ్స్‌ బృందం కలిసి నైపుణ్యం ఉన్న అభిమానుల్ని ఎంపిక చేశారు. మహేశ్‌ బొమ్మలు వేసి పంపమని కోరారు. చక్కగా వేసిన అభిమానుల జాబితాను విడుదల చేశారు. వీరంతా మహేశ్‌ మైనపు విగ్రహంతో కలిసి సెల్ఫీలు దిగొచ్చు. సాయంత్రం ఆరు గంటల వరకు విగ్రహ ప్రదర్శనకు అనుమతి ఇచ్చారు. టీవీ, వెబ్‌లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం జరగబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న మీడియాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారట.