చంద్రబాబుని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే: మోహన్‌బాబు

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుది కుటుంబపాలన అని ప్రముఖ సినీనటుడు, వైసీపీ నేత మోహన్‌బాబు ఆరోపించారు. చంద్రబాబు గురించి చెప్పడానికి 365 రోజులూ సరిపోవని వ్యాఖ్యానించారు. విజయవాడ వైసీపీ కార్యాలయంలో మోహన్‌బాబు మాట్లాడుతూ.. టీడీపీ అధినేతపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో ఆయన తనయుడు హరికృష్ణ వేల కిలోమీటర్లు తిరిగారని.. ఆ కుటుంబానికి చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. మోడీ రాష్ట్రానికి వస్తే బేడీలు వేస్తానని గతంలో ఆయన చెప్పిన విషయాన్ని మోహన్‌బాబు గుర్తు చేశారు. ఆ తర్వాత మోడీతో చంద్రబాబు చేతులు కలిపారని.. ఇప్పుడు ఆయన్ను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని.. ఇప్పుడు అలాంటి కాంగ్రెస్‌తో వెళ్తున్నారన్నారు. ఎన్టీఆర్‌పై అభిమానంతో కార్యకర్తలు ఇంకా ఆ పార్టీలో కొనసాగుతున్నారని చెప్పారు.

చంద్రబాబును ఎవరైనా నమ్ముకుంటే నట్టేట మునిగినట్టేనని మోహన్‌బాబు వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది దివంగత సీఎం వైఎస్‌ అని చెప్పారు. ఆ ప్రాజెక్టు గురించి ఆయన మాట్లాడితే చంద్రబాబు అవహేళన చేశారన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై లెక్కలు అడిగితే దొంగలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేకహోదా విషయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఒకే మాటపై నిలబడ్డారని.. సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారని చెప్పారు. హోదాపై చంద్రబాబు ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నారో ప్రజలకు పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందని మోహన్‌బాబు అన్నారు. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజల్ని ఆయన కోరారు.

CLICK HERE!! For the aha Latest Updates