ఎన్నికల బరిలోకి నాగబాబు.. పోటీ ఎక్కడి నుంచి..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలన్నీ తమ తమ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసే పనిలో మునిగిపోయాయి. అభ్యర్థుల ఎంపిక కోసం ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఏ స్థానం నుఁచి ఎవరిని బరిలోకి దింపాలి.. ఆశావహులను ఎలా బుజ్జగించాలి? కొత్తగా వచ్చే వారికి ఎలాంటి హామీలివ్వాలి ఇలా ఉన్న క్యేడర్‌ను చక్కదిద్దుకోవడానికి పార్టీల ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారు. కీలక సమయంలో ఉన్న నేతలను చేజార్చుకోకుండా బుజ్జగింపులు చేస్తున్నారు.

ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్య‌ర్ధులుగా పోటీ చేసే జాబితాలోని కొంద‌రు కీల‌క వ్య‌క్తుల పేర్లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అందులో ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు స్థానాల నుండి పోటీ చేయబోతున్నట్లు సమాచారం. రాయ‌ల‌సీమతో పాటు విశాఖలో మ‌రో స్థానంలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపనలో అన్న‌య్య చిరంజీవి కోసం తన శ‌క్తి వంచ‌న లేకుండా ప‌నిచేసిన పెద్ద తమ్ముడు నాగ‌బాబు ఆ స‌మ‌యంలో ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. అయితే, ఇప్పుడు త‌మ్ముడు పార్టీ జ‌న‌సేన నుండి మాత్రం ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే అవ‌కాశాలు చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. గుంటూరులో పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో నాగబాబు మాట్లాడుతూ తాను సాధార‌ణ కార్య‌క‌ర్త‌ను మాత్ర‌మే అని చెప్పారు. నాగబాబును ఎంపీ అభ్యర్థిగా బ‌రిలోకి దింపాల‌ని ప‌వ‌న్ కల్యాణ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నాగబాబును గుంటూరు లేదా న‌ర్సాపురం నుండి జ‌న‌సేన అభ్య‌ర్ధిగా పోటీ చేయించాల‌నుకుంటున్నారట. అందులో భాగంగానే..గుంటూరులో పార్టీ ప‌రిస్థితి పై నాగ‌బాబు ఆరా తీసిన‌ట్లు అంటున్నారు. నాగ‌బాబు పోటీ చేయడానికి సిద్ధమైతే ఆయ‌న పేరు ప్ర‌క‌టించేందుకు జనసేన రెడీగా ఉంది. నాగబాబు గెలిస్తే ఆ పార్ల‌మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ అభ్య‌ర్ధుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితమే ప‌వ‌న్ కల్యాణ్ స‌మ‌క్షంలో జ‌న‌సేన‌ పార్టీలో చేరిన పెంట‌పాటి పుల్లారావు ఏలూరు నుంచి జ‌న‌సేన ఎంపీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగటం దాదాపు ఖాయ‌మైంది. ఢిల్లీ కేంద్రంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల మీద ఆయ‌న ప‌ని చేస్తున్నారు. రాజ‌కీయ విశ్లేష‌కుడిగానే కాకుండా పోల‌వరం కోసం పోరాడిన వ్య‌క్తిగా ఆయనకు పేరుంది. ఇక‌, ప్ర‌జారాజ్యం నుండి పోటీ చేసి పాలకొల్లు స్థానంలో చిరంజీవి ఓడిపోయారు. జ‌న‌సేన నుంచి పాల‌కొల్లులో పోటీ చేసి గెల‌వాల‌ని కొంద‌రు నేత‌లు ప‌వ‌న్ కల్యాణ్‌కు సూచిస్తున్నారు. అయితే, దీని పై ప‌వ‌న్ ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేదు. పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం సైతం ఏలూరు లోక్‌స‌భ ప‌రిధిలోనే ఉండ‌టంతో పార్టీ అభ్య‌ర్దికి క‌లిసి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ ఎక్క‌డి నుండి పోటీ చేస్తార‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొని ఉంది. తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురం, విశాఖ న‌గ‌రంలోని భీమ‌లి నుండి పోటీ చేస్తార‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. అయితే, తాజాగా విశాఖ లోని గాజువాక నుండి పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌లు అక్క‌డి నుండి పోటీ చేయాల‌ని ప‌వ‌న్ ను కోర‌గా ఆయ‌న సానున‌కూలంగా స్పందించారట. గ‌తంలోనే ప‌వ‌న్ తాను అనంత‌పురం నుండి పోటీ చేస్తాన‌ని ప్ర‌కటించారు. ఇక‌, నెల్లూరు సిటీ పైనా ప‌వ‌న్ దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. నేడో రేపో జ‌న‌సేన పార్టీ అధికారికంగా అభ్య‌ర్ధుల జాబితా ప్ర‌క‌టించ‌నుంది. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ చౌడ‌వ‌రం తో పాటుగా అనంత‌పురం లేదా నెల్లూరు నుండి బ‌రిలోకి దిగుతార‌ని పార్టీ నేత‌లు అంటున్నారు.