‘జెర్సీ’ వెనుక కష్టాలు .. ‘జర్నీ ఆఫ్‌ జెర్సీ’ వీడియో

సినిమా కోసం, అందులోని పాత్ర కోసం ఎంతైనా కష్టపడే అతి కొద్ది మంది నటుల్లో యంగ్‌ హీరో నాని ఒకరు. అందుకే ఆయన నేచురల్‌ స్టార్‌ అయ్యారు. నాని హరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌. ఇందులో నాని అర్జున్‌ అనే 36ఏళ్ల క్రికెటర్‌గా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర బృందం ‘జర్నీ ఆఫ్‌ జెర్సీ’ పేరుతో వీడియోను అభిమానులతో పంచుకుంది.

ఈ సినిమా కోసం నాని ప్రొఫెషనల్‌ క్రికెట్‌ నేర్చుకున్నారు. ఇందుకోసం 70రోజుల పాటు కఠోర సాధన చేశారు. క్రికెట్‌ నిపుణుల సమక్షంలో సాగిన ఈ సాధనలో ఎన్నో మెలకువలు నేర్చుకున్న తర్వాత సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. మైదానంలో తీసే సన్నివేశాలకు నాని, చిత్ర బృందం ఎంత కష్టపడిందో ఈ వీడియోలో చూపించారు. ఒక సన్నివేశంలో నాని ముఖానికి బాల్‌ తగలడంతో రక్తం కూడా వచ్చింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘జెర్సీ’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఏప్రిల్‌ 19న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సత్యరాజ్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, సంపత్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.