
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో రియా చక్రవర్తి డ్రగ్స్ ‘లీలలు’ ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. ఆమె మత్తుమందులు తెచ్చి అమ్మేదని మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సీబీ) తన నివేదికలో తెలిపింది. రియా ఇంటిపై నిన్న ఎన్‌సీబీ అధికారులు దాడులు జరిపిన సంగతి విదితమే. రియాతో మరికొందరికి మధ్య వాట్సాప్ ద్వారా జరిగిన చాటింగ్ ని బట్టి చూస్తే డ్రగ్స్ ని తేవడం, వినియోగించడం, అమ్మడం, రవాణా చేయడం వంటివన్నీ జరిగినట్టు తెలుస్తోందని ఈ నివేదికలో పేర్కొంది. దీనికి సంబంధించి ఆమె నుంచి మరిన్ని వివరాలు, సమాచారాన్ని రాబట్టేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సిబ్బంది ఆమెను ఆదివారం విచారించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రియాకు ఇప్పటికే ఎన్‌సీబీ సమన్లు పంపింది. విచారణ అనంతరం రియాను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఎన్సీబీ అధికారుల విచారణలో షోవిక్ చక్రవర్తి సంచలన విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. శామ్యూల్ మిరిండా సహాయంతో డ్రగ్స్ సేకరించినట్లు, తన సోదరి రియా ఆదేశాల మేరకే సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చినట్లు షోవిక్ పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది.













