రణు మండల్‌ కొత్త అవతారం.. దెయ్యం తిట్టిపోస్తున్న నెటిజన్లు..

రణు మండల్ సింగింగ్ సెన్సేషన్ … నెటిజన్ల ఆగ్రహాన్ని చూస్తున్నారు. మొన్నటిదాకా ఆమె బాలీవుడ్‌కి గిఫ్ట్ అంటూ మెచ్చుకున్న సోషల్ మీడియా… ఇప్పుడు ట్రోలింగ్ తుఫానుతో విరుచుకుపడుతోంది. ఆమె పాడుతున్న పాటలు విని… వావ్ అని మెచ్చుకున్న నోళ్లే ఇప్పుడు ఏంటా మేకప్ అని తిట్టిపోస్తున్నాయి. పీచ్ లెహంగా వేసుకున్న రణు మండల్… మేకప్‌తో ఉన్న ఓ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అందులో ఆమె మేకప్ ఓవర్ డోస్ అవ్వడంతో… అసలామె రణు మండల్ అని గుర్తించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆమెకు అంత మేకప్ ఎందుకు… మేకప్ లేకపోతే ఆమెను ఎవరైనా చిన్నబుచ్చుతున్నారా అంటూ నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల ఓ అభిమాని రణు మండల్‌ని కలిసి… ఆమెతో సెల్ఫీ తీసుకుంటానని అడిగితే… తనకు కాస్త దూరంగా ఉండి సెల్ఫీ తీసుకోమని ఆమె చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసి… ఒకప్పుడు ముంబై రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేసుకునే రణు మండల్… తన మూలాల్ని మర్చిపోయారా అని నెటిజన్లు నిలదీశారు. స్టార్ డమ్‌ను ఆమె తలకెక్కించుకుంటున్నారని నెటిజన్లు మండిపడినా… రణు మండల్ స్పందించలేదు. ఐతే… ఆ తర్వాత ఓ ప్రెస్‌మీట్‌లో ఆమె కాస్త దురుసుగా ప్రవర్తించడం కూడా విమర్శలకు దారితీసింది.

బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేషమ్మియా ద్వారా రణు మండల్… ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొన్ని పాత పాటల్ని ఆమె అత్యంత చక్కగా పాడుతుండటంతో సెలబ్రిటీ అయ్యారు. ఆమె పాడిన తేరీ మేరీ ఓల్డ్ సాంగ్… సెన్సేషన్ అయ్యింది. ఆమె వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు. రణు మండల్‌కి ఫ్యామిలీ ఏదీ లేదనీ, ఆమె ఒంటరి అని తెలిసింది.