వైసీపీని గెలిపిస్తే నెత్తిన భస్మం చల్లుకున్నట్లే: పవన్‌ కల్యాణ్‌


జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రౌడీయిజం పెరుగుతుందని విమర్శించారు. ‘జగన్‌ సంస్కృతి’ ని కాకినాడకు తీసుకువస్తే తరిమికొడతామని తీవ్రంగా హెచ్చరించారు. ఎస్సీ సామాజిక వర్గానికి జగన్‌ ఏం చేశారని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్‌ మాట్లాడారు. వైఎస్‌ కుటుంబం మహిళలకు చేసిన అన్యాయం తెలుసన్న ఆయన.. సామాన్యుడికి అండగా నిలిచే జనసేనను ఆశీర్వదించాలని కోరారు. వైసీపీని గెలిపిస్తే నెత్తిన భస్మం చల్లుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్లపై జగన్‌ మాట్లాడినప్పుడు కాకినాడ రూరల్‌ వైసీపీ అభ్యర్థి కన్నబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో కలపాలని ఒత్తిడి చేసింది కన్నబాబేనన్నారు. రామచంద్రాపురం టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు జనసేనను తన చేతుల్లోకి తీసుకోవాలనుకున్నారని ఆరోపించారు. ‘చలమలశెట్టి సునీల్‌ జనసేనలోకి వస్తానని చెప్పి టీడీపీలోకి వెళ్లారు. నా విలువైన సమయాన్ని వృథా చేసి టీడీపీకి తొత్తుగా మారారు’ అని దుయ్యబట్టారు. రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవని.. మార్పు సహజంగా రావాలని పవన్‌ అన్నారు.