సినీనటుడు అలీపై పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ .. సినీనటుడు అలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ తనకు మిత్రుడైనా వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో చేతులు కలిపారన్నారు. అలీ చెప్పిన వాళ్లకు టిక్కెట్‌ ఇచ్చినా తనను వదిలి వెళ్లాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నానని, తనతో కలిసి పనిచేస్తానన్న అలీ చెప్పకుండానే వైసీపీలోకి వెళ్లిపోయారన్నారు. అలీ లాంటివాళ్ల వల్ల మనుషులపై నమ్మకం పోతుందని వ్యాఖ్యానించారు.

తాను ఎన్నికల్లో రాణించలేనని ఎలా అనుకుంటారని, ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి’ సినిమాతో స్టార్‌ అవుతానని ఎవరైనా అనుకున్నారా అని పవన్‌ ప్రశ్నించారు. అవసరంలో తాను ఆదుకున్న అలీ లాంటి వాడే వదిలేస్తే ఇంకా ఎవరిని నమ్మాలన్నారు. అందుకే ప్రజలను తప్ప బంధుమిత్రులను కూడా నమ్మడం లేదన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఓటుకు రూ.2వేలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, అలీని జగన్‌ వాడుకొని వదిలేశారని పవన్‌ ఆరోపించారు.