రూపాయి వాసన చూపిస్తే మోసపోయే తరం కాదిది: పవన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మా పార్టీ అధికారంలోకి రాగానే 3లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. కొత్త రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా తానే వస్తానని విశ్వాసం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకరికి ఊడిగం చేసే రోజులు పోయాయని, పల్లకీలు మోసిన ప్రజలనే తాను పల్లకీలు ఎక్కిస్తానని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసమే పంచె కట్టానన్నారు. అధికారం కొన్ని కుటుంబాలకే పరిమితం కాకూడదన్నారు. గుంటూరులో ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రూపాయి వాసన చూపిస్తే మోసపోయే తరం ఇది కాదన్నారు. అతిసారంతో ప్రజల ప్రాణాలు పోయినా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ పట్టించుకోలేదని మండిపడ్డారు. కమీషన్ల కోసమే గుంటూరులో తరచుగా రోడ్లు, కాల్వలు తవ్వుతున్నారని ఆరోపించారు. జనసేన వస్తే 40 ఏళ్లకు సరిపడా శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. వైసీపీలాగా డొంకతిరుగుడు రాజకీయాలు తనకు రావని పవన్‌ వ్యాఖ్యానించారు. ఇక్కడ బీజేపీను తిట్టడం, ఢిల్లీ వెళ్లి వారి పట్టుకోవడం వైసీపీ నైజమన్నారు. వైసీపీకి ముస్లిం ప్రజల ఓట్లు కావాలి గానీ వారికి పదవులు మాత్రం ఇవ్వరని ధ్వజమెత్తారు.