ధర్మపోరాట దీక్షకు జాతీయ నేతల సంఘీభావం

ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. వివిధ జాతీయ పార్టీలు ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, ఎస్పీ నేత ములాయం, టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్‌, శరద్‌ యాదవ్‌ తదితరులు దీక్షకు మద్దతు పలికారు. ఏపీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ఎవరేమన్నారంటే..

‘భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చింది. ప్రత్యేక హోదా హామీ కూడా పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిందే. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తాం అని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు.

‘పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే. ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. అందుకే ఆంధ్రా ప్రజలు ఇక్కడికి వరకు వచ్చారు. ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలను విభజించి కేంద్రం పాలించాలని చూస్తోంది. దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం పోవాలి. వ్యక్తిగత దూషణల స్థాయికి ప్రధాని దిగజారకూడదు. ప్రధాని అన్న వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అని ఫరూక్‌ అన్నారు.

‘ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. చంద్రబాబు వెంట మేమంతా ఉంటాం. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా ఎస్పీ ఆయన వెంటన నడుస్తోంది. చంద్రబాబు వెంట రైతులు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. వారు న్యాయం కోసం పోరాడతారు. అవసరమైతే తిరగబడతారని ములాయం అన్నారు.

‘పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. దానిపై ప్రధాని మోడీ ఒక్క మాట మాట్లాడరు. మోడీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం గద్దె దిగే సమయం ఆసన్నమైంది. మోడీ, అమిత్‌ షా ఇద్దరూ దేశ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. తన ప్రసంగాల్లో మోడీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ దేశానికి మోడీ చేసిందేమీ లేదు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ఆయన నిర్వీర్యం చేస్తున్నారు.’ అన్నారు ఒబ్రెయిన్‌