సినీ నటి అపూర్వ ఆవేదన


పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్అనుచరులపై సినీ నటి అపూర్వ హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తాను ఎమ్మెల్యే చింతమనేనిపై చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరినట్టు అపూర్వ తెలియజేశారు. తన కుటుంబ వ్యవహారాలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు.

ఓ యుట్యూబ్ ఛానల్‌లో నేను చింతమనేనిని ఏదో అన్నానని బెదిరింపులకు దిగుతున్నారన్న ఆమె… గతంలో మా ఇంటి ముందు ఒక దిమ్మె కడుతున్న సమయంలో వ్యతిరేకించినందుకు అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని విమర్శించారు. గొడవలు రావడంతో నా భర్తతో విడాకులు తీసుకున్నట్లు.. ఇప్పుడు నా భర్తను తీసుకొచ్చి నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడిస్తున్నారని అపూర్వ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు నలుగురుపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశానని… నేను ఇచ్చిన ఆధారాలు పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పినట్టు ఆమె వెల్లడించారు.