విడాకుల ఆలోచనలో ప్రియాంక, నిక్‌??

బాలీవుడ్‌లో మోస్ట్‌ రొమాంటిక్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు నిక్‌యాంక దంపతులు. ప్రియాంక చోప్రా వయసులో తన కన్నా పదేళ్లు చిన్న వాడైన హాలీవుడ్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహం బంధం హాలీవుడ్‌ పత్రికలకు, ప్రముఖులకు నచ్చలేదు కాబోలు. కుదిరినప్పుడుల్లా వీరిద్దరి గురించి అవాకులు, చేవాకులు పేలుతూ.. పుకార్లను ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓకే! అనే ఆంగ్ల మ్యాగ్‌జైన్‌ ఏకంగా వీరిద్దరు విడాకులు తీసుకోబుతున్నారంటూ ఓ కథనాన్ని ప్రచురించింది.

సదరు మ్యాగ్‌జైన్‌ చెప్పిందేంటంటే.. ‘నిక్‌యాంకలకు ఒకరి గురించి ఒకరికి ఇప్పుడే పూర్తిగా తెలుస్తోంది. పని, పార్టీలు, ఒకరితో ఒకరు కలిసే ఉండే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎంత త్వరగా పెళ్లి చేసుకున్నారో.. అంత త్వరగా దాన్ని ముగించబోతున్నారు. వారి బంధం ఓ దారం ఆధారంగా వేలాడుతోంది. అది ఎప్పుడైనా తెగిపోవచ్చు. నిక్‌ ప్రియాంకను చూసి చాలా ప్రశాంతంగా ఓర్పుగా ఉంటుందని భావించాడు. కానీ ఈ మధ్య ప్రియాంక డామినేషన్‌ పెరిగిపోయింది. ఆమెకు కోపం కూడా ఎక్కువే. పాపం పెళ్లి తర్వాతే ఈ విషయాలన్ని నిక్‌కి తెలుస్తున్నాయి’ అంటూ రాసుకొచ్చింది.

అంతేకాక ‘నిక్‌ కుటుంబ సభ్యులు కూడా ప్రియాంక చాలా పరిపక్వత కల్గిన స్త్రీ.. వివాహం తర్వాత ఇక ఆమె సినిమాలను వదిలేసి.. పిల్లాపాపలతో సెటిలవుతుందని భావించారు. కానీ ప్రియాంక ఇప్పుడు కూడా 21 ఏళ్ల యువతిలాగా ప్రవర్తించడం నిక్‌ కుటుంబ సభ్యులకు నచ్చడం లేదు. దాంతో వారు నిక్‌ను విడాకులు తీసుకోమని కోరుతున్నారు. కొద్ది రోజుల పరిచయంతోనే వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కనీసం వివాహపూర్వ ఒప్పందాన్ని కూడా చేసుకోలేదు’ అంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ వార్తలపై ఇంతవరకూ ప్రియాంక కానీ, నిక్‌ కానీ స్పందించలేదు. ప్రియాంక చోప్రా – నిక్‌ జోనాస్‌లు గత ఏడాది డిసెంబరులో వివాహబంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే.