నీ మనసు ఎక్కడుందో బయటపెట్టావ్.. సానియా మీర్జాను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

మనం చేసే ప్రతి పనికీ సమయం, సందర్భం ఉండాలి. ఒక పనిని ఒకసారి చేస్తే మెచ్చుకున్నవారే, మరో సందర్భంలో నిరసన వ్యక్తం చేయొచ్చు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇన్‌‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తన చెల్లెలు, ఫ్యాషన్ డిజైనర్ అయిన అనమ్ మీర్జా రూపొందించిన దుస్తులను ధరించిన సానియా ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఉగ్రదాడిలో జవాన్లు అసువులు బాసిన ప్రస్తుత సమయంలో సానియా ఇలా ఫ్యాషన్ ఫొటోలను షేర్ చేయడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.

వేరొకరు ఎవరైనా అయితే ట్రోలింగ్ తక్కువగా ఉండేదేమో కానీ.. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ఆమె పెళ్లాడటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘సానియా భారత మహిళగా నిన్నుగౌరవిస్తున్నాం. కానీ పాకిస్థానీ భార్యగా ఎప్పటికీ గౌరవించం’ అని ఒకరు కామెంట్ చేయగా.. నీ మనసు ఎక్కడుందో బయటపెట్టావ్, నువ్వు అసలైన పాకిస్థానీవి అంటూ మరొకరు ఘాటుగా స్పందించారు.

నీ బుద్ది పాడైయిందా అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సైనికులకు సానుభూతి ప్రకటిస్తూ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఇదేంటి? దేశం పట్ల నీకు కృతజ్ఞత లేదు, హేట్ యూ అని ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు.

పేరు తెచ్చుకోవడం కోసం భారత జెండా ఉపయోగించావ్. ఇప్పుడు భారత్ నిన్ను బాయ్‌కాట్ చేస్తోంది. భారతీయులంతా ఆమెను అన్‌ఫాలో కండి. ఆమె మనసు ఎక్కడుందో బయటపెట్టుకుంది’ అని ఒకరు కామెంట్ చేశారు. కాగా పుల్వామా దాడి ఘటన పట్ల సానియా స్పందించారు. దాడిని ఖండిస్తూ ఆమె ట్వీట్ చేశారు.