మీడియాపై రకుల్‌ ఫైర్‌..

 

హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి ముద్దుగుమ్మ మండిపడింది. ఏమిటీ రాతలంటూ ఆ గాసిప్స్ రాస్తున్న వారిపై మండిపడింది. ఇంతకీ విషయం ఏమిటంటే, శివకార్తికేయన్ హీరోగా తమిళంలో రూపొందుతున్న ఓ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది. కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఆచిత్రం లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. అయితే, ఇప్పుడు షూటింగులు మొదలవుతున్నా, తను మరో రెండు నెలల వరకు షూటింగులో జాయిన్ కానంటూ రకుల్ దర్శక నిర్మాతలకు చెప్పిందనీ, దాంతో ఆగ్రహించిన నిర్మాత ఆమెను చిత్రం నుంచి తొలగించారనీ తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి.

ఇప్పుడీ వార్తలు రకుల్ దృష్టికి వెళ్లడంతో ఆమె అప్సెట్ అయింది. ‘బాధ్యతాయుతమైన జర్నలిజం మనకు ఎప్పుడు వస్తుంది? వాస్తవాలను చెక్ చేసుకుని రాయడం అన్నది మీడియా ఎప్పుడు మొదలు పెడుతుంది?’ అంటూ మీడియాపై రకుల్ ఓ రెంజ్‌లో ఫైర్ అయింది. ‘నాకూ షూటింగ్ చేయాలనే వుంది, అసలు షూటింగులు ఎక్కడ జరుగుతున్నాయో చెప్పండి?’ అంటూ కూడా ప్రశ్నించింది.

ఇక దీనిపై ఆ చిత్ర దర్శకుడు ఆర్.రవికుమార్ కూడా స్పందించాడు. ‘నేను ఇంతవరకు పనిచేసిన ప్రొఫెషనల్ ఆర్టిస్టులలో రకుల్ ఒకరు. ఆమెతో షూటింగ్ మొదలుపెట్టడానికి మేము కూడా ఎంతో ఎదురుచూస్తున్నాం. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’ అంటూ రకుల్ ని వెనకేసుకొచ్చాడు. దీంతో ఆ సినిమా నుంచి రకుల్ ని తీసేయడం అన్నది ఒట్టి పుకారు అనే తెలిసిపోయింది.

CLICK HERE!! For the aha Latest Updates