
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ తనయుడు.. ‘ఓ పిట్టకథ’ ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్లమ్‌డాగ్ హస్బండ్’. ఈ సినిమాతో డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మైక్ మూవీస్ బ్యానర్‌పై అక్కిరెడ్డి, వెంకట్ అన్నపు రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రణవి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను దగ్గుబాటి రానా ఆవిష్కరించాడు. సంజయ్ రావు పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. మోషన్ మోస్టర్ ఎంతో హ్యూమరస్‌గా ఉందన్న రానా మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
‘స్లమ్‌డాగ్ హస్బండ్’ మూవీ సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. వివాహాల్లో కొంతమంది పాటిస్తున్న కొన్ని మూఢనమ్మకాలను వినోదాత్మకంగా చూపెడుతున్నాడు దర్శకుడు. ఈ పోస్టర్ కొందరికి జంతువులతో వివాహం చేసిన న్యూస్ క్లిప్పింగ్స్, రాశుల ఫొటోలతో ఆసక్తికరంగా ఉంది. అంతేకాకుండా ఇందులో హీరోకు కుక్కతో పెళ్లి జరిపించే ఫొటోను చూపించారు అర్జున్ రెడ్డి సినిమా తరహాలో ‘ఎవడ్రా నా కుక్కపై రంగుపోసింది’ అని డైలాగ్ చెప్పడం బాగా నవ్విస్తోంది. ‘మిమ్మల్ని ఈ పెళ్లికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం’ అంటూ మోషన్ పోస్టర్‌ను ముగించారు.













