HomeTelugu Newsఆడపిల్లకు కష్టం వస్తే.. గన్‌ కంటే ముందే జగన్‌ రక్షిస్తాడనే నమ్మకం రావాలి: రోజా

ఆడపిల్లకు కష్టం వస్తే.. గన్‌ కంటే ముందే జగన్‌ రక్షిస్తాడనే నమ్మకం రావాలి: రోజా

6 8
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మహిళాంధ్ర ప్రదేశ్‌గా మారాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆకాంక్షించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలి రోజు మహిళల రక్షణకు సంబంధించిన అంశంపై నిర్వహించిన చర్చలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. దిశ ఘటన తర్వాత తొలిసారిగా ఏపీలో మహిళా భద్రతపై చర్చ జరుగుతుంటే దేశమంతా ఈ అసెంబ్లీలో ఎలాంటి చట్టాలు చేస్తారు? మనకు ఎలా భద్రత కల్పిస్తారని మహిళలంతా ఎదురు చూస్తున్నారన్నారు. మొన్న ‘దిశ’ను అత్యాచారం చేసి చంపి దహనం చేసిన విధానం చూస్తుంటే మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కన్నీళ్లొస్తాయన్నారు. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారనీ.. ఆడ పిల్లలు కాలేజీలకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొందన్నారు. నిన్న దిశ.. మొన్న రిషితేశ్వరి, ఆ ముందు నిర్భయ.. అంతకన్నా ముందుచూస్తే స్వప్నిక, ప్రణీత.. రేపు ఈ మృగాళ్లకు బలి కావాల్సింది ఎవరో అన్న భయంతో కంటిపై కునుకు లేకుండా మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మహిళను అడవిలో వదిలేసి వస్తే భద్రంగా బయటకు వచ్చే అవకాశం ఉందేమో గానీ.. పొద్దున్న లేచి బయటకు వెళ్తే మాత్రం ఈ సమాజంలో తిరిగి వస్తుందనే నమ్మకం లేకపోవడం చాలా దురదృష్టకరమని రోజా ఆవేదన వ్యక్తంచేశారు.

”ఆడ పిల్లల భద్రత పరిస్థితి దిగజారిపోయింది. బాహుబలి-2లో సేనాధిపతి భార్య భుజంపై మరో సేనాధిపతి చేయి వేసి వెకిలిచేష్టలు చేస్తే ఆ హీరో కామాంధుడి తల నరికాడు. నేను థియేటర్‌లో చూశా. ఆ సమయంలో ఆడవాళ్ల కళ్లల్లో ఆనందం పెల్లుబికింది. వారి గుండెల్లో ఎగిసిన అగ్నిపర్వతం చల్లారింది. తప్పుచేసిన వాడికి శిక్ష పడటాన్ని సినిమాలో చూసి తృప్తి చెందే పరిస్థితికి ఆడది దిగజారిపోయిందంటే మనం ఆలోచించుకోవాలి. ఆడపిల్లకు కష్టం వచ్చేలోపు గన్‌ వచ్చేకంటే ముందే జగన్‌ వచ్చి రక్షిస్తాడనే ఒక నమ్మకం ప్రజలకు కావాలి. ఆడపిల్ల కళ్లల్లో కన్నీరు కారిస్తే ఆ కన్నీరు ఆవిరయ్యేలోపు వారికి శిక్ష వేస్తారన్న నమ్మకాన్ని ఈ అసెంబ్లీ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళలు బతికి బట్టకట్టాలంటే సత్వర న్యాయం కావాలి. సత్వర న్యాయం జరగకుండా ఆలస్యమైతే అది అన్యాయంగా మారిపోతుంది. కోర్టులు, చట్టాలు తొందరిగా పనిచేయాలి. తప్పుచేసిన వాడికి శిక్ష పడేంతవరకు బెయిల్‌ కూడా ఇవ్వకూడదని కోరుకుంటున్నా. నిందితులు బెయిల్‌పై బయటకు వస్తే ఉన్నావ్‌ ఘటనలా బాధితులను బతకనివ్వరు. సాక్ష్యాన్ని సజీవంగా దహనం చేస్తారు. న్యాయం జరగడంలేదు గన్‌కే ఎన్‌కౌంటర్‌లకు మద్దతు తెలిపే పరిస్థితికి దిగజారిపోవాల్సి వచ్చింది” అన్నారు.

”జగనన్నను ఒకటే కోరాలనుకుంటున్నా.. ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే వారికి వెన్నులో వణుకు పుట్టేలా ఒక చట్టాన్ని తేవాలి. ఆంధ్రప్రదేశ్‌ అంటే ఆడవాళ్ల ప్రదేశ్‌గా మారాలి. ఏ రాష్ట్రంలోనైనా ఆడ పిల్లకు భయం వేస్తే ఏపీలో మనకు రక్షణ ఉంటుంది. అక్కడికి వెళ్లి దాక్కోవాలని మన వద్దకు వచ్చే పరిస్థితి జగన్‌ కల్పిస్తారని నమ్ముతున్నా. మానవహక్కుల కమిషన్‌ దిశ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది. కానీ, ఆమెను హత్య చేసిన వారిని ఎన్‌కౌంటర్‌ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన అంటూ పెద్ద ఎత్తున అరుస్తున్నారు. నేరస్థులకు మాత్రమే మానవ హక్కులు ఉంటాయా? ఆడ వాళ్లకు లేవా? పిల్లలకు లేవా? ”అని రోజా ప్రశ్నించారు.

”జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చరిత్రలోనే రెండు చోట్ల నుంచి నిలబడి ఓడిపోయిన గొప్ప నాయకుడు. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే సభలో ఉన్నారు. ఆయన ద్వారా పవన్‌కు చెప్పాలనుకుంటున్నా.. అత్యాచారం చేసిన వారిని ఉరితీయడమేంటి? రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలు అంటున్నారు. గతంలో ఏం జరిగిందని పవన్‌ రివాల్వర్‌ పట్టుకొని రోడ్లపైకి వచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది. మా అక్కను అవమానిస్తే వారిని చంపాలనిపించిందని ఆయన ఇంటర్వ్యూలో చెప్పినదాన్నీ మనం విన్నాం” అని రోజా అన్నారు. అయితే, ఆమె వ్యాఖ్యలపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అభ్యంతరం వ్యక్తంచేశారు. సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావన వద్దన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu