మహేష్, బాలయ్యలతో శర్వా పోటీ!

ఇప్పటికే పెద్ద సినిమాలు దసరాను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాయి. దీంతో ఆ డేట్ కు రావాలనుకున్న సినిమాలు కాస్త వెనక్కి తగ్గాయి. ఎన్టీఆర్ కూడా దసరాకు రావాలనుకొని ఇప్పుడు పోటీ పడడం ఇష్టంలేక తన సినిమాను ముందుగానే థియేటర్ లో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. అయితే పెద్ద సినిమాలు ఉంటే ఏంటి..? నా సినిమా కూడా అప్పుడే రిలీజ్ చేస్తా అంటున్నాడు యంగ్ హీరో శర్వానంద్. మహేష్-మురుగదాస్, అలానే బాలయ్య-పూరిల సినిమాలు సెప్టెంబర్ 23,29 డేట్లను ఖాయం చేసుకున్నాయి. ఇప్పుడు శర్వా వారితో పోటీగా సెప్టెంబర్ 22న తన సినిమాను విడుదల చేయబోతున్నాడు. 
మారుతి దర్శకత్వంలో శర్వా నటిస్తోన్న ‘మహానుభావుడు’ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. కొంత టాకీ పార్ట్, ఒక పాట మాత్రమే బ్యాలన్స్ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి దసరా బరిలో దింపాలని నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ భావిస్తోంది. అయితే శర్వానంద్ కు ఇలాంటి పోటీ కొత్తేమీకాదు. రెండు సార్లు సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీగా దిగి నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన ఫీట్ ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి ఈసారి ఎలాంటి సక్సెస్ ను అందుకుంటాడో.. చూడాలి!