HomeTelugu Trendingనరేశ్‌పై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు

నరేశ్‌పై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు

‘మా’ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వివారలు పెరిగిపోతున్నాయి. తాజాగా నరేశ్ ను లక్ష్యంగా చేసుకుని ఓ ఇంటర్వ్యూలో ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న వివాదాలన్నింటికీ కారణం నరేశేనని ఆరోపించారు. గత ఏడాది నాగబాబు మద్దతు ప్రకటించకపోయి ఉంటే నరేశ్ అసలు గెలిచి ఉండేవారేకాదన్నారు. నరేశ్ ఆడే పాచికలాటలో ప్రాణ మిత్రులు కూడా విడిపోవాల్సి వచ్చిందన్నారు. ‘మా’లో నరేశ్ ఓ చిన్నపిల్లాడని అన్నారు. ఎప్పుడూ అబద్ధాలే చెబుతాడని, ఆయన నోటివెంట నిజం వచ్చిన నాడు ఆశ్చర్యపోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. తనపై నరేశ్ ఎన్నెన్నో అసత్యాలు ప్రచారం చేశాడని ఆరోపించారు. నరేశ్ రాకతోనే అసోసియేషన్ లో రాజకీయాలు మొదలయ్యాయన్నారు. మహేశ్ వాళ్ల ఇల్లు ఎక్కడో కూడా నరేశ్ కు సరిగ్గా తెలియదన్నారు.

తాను మా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికాలో ఫండ్ రైజింగ్ ఈవెంట్ ను నిర్వహించామని, చిరంజీవితో పాటు చాలా మంది హీరోహీరోయిన్లు, నటీనటులు హాజరయ్యారని, అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్న నరేశ్ మాత్రం రాలేదని గుర్తు చేశారు. అమెరికా రాకుండా మీటింగ్ పెట్టి తనపై అబద్ధాలు చెప్పారన్నారు. నటీనటుల విమాన టికెట్ల డబ్బులను తాను, శ్రీకాంత్ వాడుకున్నామని ఆరోపించారని చెప్పారు. అయితే, అవన్నీ అబద్ధాలేనని చిరంజీవి వేసిన సినీపెద్దల కమిటీ తేల్చిందని తెలిపారు. అప్పుడు వచ్చిన నిధులతోనే ఇప్పుడు ‘మా’ సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారని అన్నారు. తనకు, శ్రీకాంత్ కు క్షమాపణలు చెప్పే దాకా నరేశ్ ను తిడుతూనే ఉంటానన్నారు.

‘మా’ సభ్యుల కోసం ఓ వృద్ధాశ్రమాన్ని నిర్మించాలనుకున్నానని, దానికి అమెరికాలో మరో ప్రోగ్రామ్ నిర్వహించాలనుకున్నానని శివాజీ రాజా చెప్పారు. మహేశ్ కు చెబితే.. ఓకే అన్నారని, నమత్రతోనూ మాట్లాడమన్నారని గుర్తు చేశారు. నరేశ్ తో పాటు మరో 8 మందితో కలిసి వెళ్లి నమ్రతతో మాట్లాడితే ఆమె కూడా ఓకే అన్నారని చెప్పారు. ప్రభాస్ ను కలిస్తే.. షూటింగ్ ఉండడంతో రాలేనన్నారని తెలిపారు. అయితే, తనవంతుగా రూ.2 కోట్లు ఇస్తానని చెప్పారన్నారు. అంతా ఓకే అయ్యాక నరేశ్ తనపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, ఆ తర్వాత ఎన్నికలు జరిగి తమ ప్యానెల్ ఓడిపోయిందని శివాజీ రాజా వివరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!