నొప్పిని భరిస్తున్న.. వేలు లేపే శక్తి లేక బాధపడుతున్న: సోనాలి

బాలీవుడ్‌ ప్రముఖ నటి సోనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. సోనాలి పరిస్థితి నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్‌ ఇటీవల తెలిపారు. కాగా, చికిత్స క్రమంలో చాలా నొప్పిని భరిస్తున్నట్లు సోనాలి తాజాగా చెప్పారు. తన ఆవేదనను తెలుపుతూ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. దీంతోపాటు ఓ ఫొటోను షేర్‌ చేశారు సోనాలి.

‘గత కొన్ని నెలలుగా నాకు మంచి, చెడు రెండూ ఎదురయ్యాయి. నేను చాలా బలహీనపడిపోయి.. కనీసం చేతి వేలు పైకి ఎత్తడానికి శక్తిలేక బాధపడ్డాను. ఇది కూడా ఓ ప్రక్రియలా అనిపిస్తోంది. శారీరకంగా ప్రారంభమైన ఈ నొప్పి.. మానసికంగా, ఎమోషనల్‌గా దెబ్బతీస్తోంది. కీమో థెరపీ, సర్జరీ తర్వాత కొన్ని రోజులు చాలా కష్టమైంది.. కనీసం నవ్వినా నొప్పి వచ్చేది’.’కొన్నిసార్లు క్యాన్సర్‌ నా నుంచి మొత్తం తీసేసుకుంటున్న భావన కలుగుతోంది. ప్రతి నిమిషం నాతో నేను పోరాటం చేస్తున్నా. ఇలాంటి చెడు రోజులు జీవితంలో కచ్చితంగా వస్తుంటాయి. దాన్ని ఎదుర్కొని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి’.

‘నొప్పిని భరిస్తూ ఏడ్చా. మనకేం అవుతోందో, ఎటువైపు వెళ్తున్నామో కేవలం మనకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని అంగీకరించడమే మంచిది. భావోద్వేగానికి గురి కావడం తప్పేం కాదు. నెగిటివ్‌ ఎమోషన్స్‌ను ఫీల్‌ అవడం కూడా తప్పు కాదు. కానీ, ఆ తర్వాత దాన్ని గుర్తించాలి. మీ జీవితంలో దాని ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఈ జోన్‌ నుంచి బయటికి రావడానికి చాలా స్వీయ జాగ్రత్త అవసరం. ఇలాంటి ఆలోచనలు రాకుండా చేయడంలో నిద్ర చాలా సహాయపడుతుంది. లేదా నా కుమారుడితో మాట్లాడుతూ ఉంటే చెడు ఆలోచనలు రావు’. ‘ఇప్పుడు నా చికిత్స కొనసాగుతోంది.. నా రూపు కాస్త చక్కగా మారింది. త్వరలో ఇంటికి వచ్చేస్తాను’ అని సోనాలి పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది ఓ పరీక్ష అని, జీవితం మొత్తం నేర్చుకుంటూనే ఉండాలని ఆమె అన్నారు.