HomeTelugu Newsఏపీకి కొత్తగా రైల్వేజోన్ (దక్షిణ కోస్తా రైల్వే).. కంటి తుడుపు చర్యేనా..!

ఏపీకి కొత్తగా రైల్వేజోన్ (దక్షిణ కోస్తా రైల్వే).. కంటి తుడుపు చర్యేనా..!

1 28
ప్రధానమంత్రి విశాఖ పర్యటనకు ఒకరోజు ముందు రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ఏపీ రాష్ట్రానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. విశాఖపట్టణం కేంద్రంగా “దక్షిణ కోస్తా రైల్వే జోన్‌” ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కొత్త జోన్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వాల్తేరు డివిజన్‌ను విభజించి కొత్త జోన్‌ పరిధిలోకి వచ్చే ప్రాంతాన్ని విజయవాడ డివిజన్లో విలీనం చేస్తున్నట్లు స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్రమోడీ మార్చి 1న విశాఖపట్నం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆలోగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తేనే సముచితంగా ఉంటుందని ఈనెల 23న విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం రైల్వేమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని షెడ్యూల్‌ 13 (మౌలిక వసతులు)లో పొందుపరిచిన 8వ అంశం ప్రకారం ఏపీలో కొత్తరైల్వేజోన్‌ ఏర్పాటుపై రైల్వే మంత్రిత్వశాఖ పరిశీలన చేయాల్సి ఉంది. భాగస్వామ్య పక్షాలన్నింటినీ సంప్రదించి దానిపై అధ్యయనం అనంతరం విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్‌ ఏర్పాటు దిశగా ముందడుగు వేయాలని నిర్ణయించాం. కొత్తజోన్‌కు దక్షిణ కోస్తా రైల్వే (సౌత్‌ కోస్ట్‌ రైల్వే)” అని నామకరణం చేశాం” అని గోయల్‌ ప్రకటించారు. కొత్త జోన్‌ ఎప్పటినుంచి మనుగడలోకి వస్తుందన్న ప్రశ్నకు బదులిస్తూ- రైల్వే బోర్డు, మంత్రిత్వ శాఖల స్థాయిలో నిర్ణయం తీసుకున్నాం, ఇక మిగిలిన అంశాలపై తదుపరి కార్యాచరణ చేపడతాం అని వెల్లడించారు.

రాష్ట్రంలో విశాఖపట్టణం కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటుచేయాలని ఐదేళ్లుగా కేంద్రాన్ని అడుగుతున్నా స్పందించని కేంద్రం ఎన్నికల ముందు హడావుడిగా ప్రకటించి ప్రజలను మభ్యపెడుతుందని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. ఇపుడు ప్రకటించిన జోన్‌ మనం సాధించుకున్న పోరాట ఫలితం. పార్టీ తరఫున, రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతోనే దీన్ని ఇచ్చారు. ఏదిఏమైనా పోరాడి సాధించుకున్నాం. అయితే ఇదంతా కంటితుడుపు చర్యగానే కనిపిస్తోంది అని మంత్రి గంటా వ్యాఖ్యానించారు. 125 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేర్‌ డివిజన్‌ను ఇష్టం వచ్చినట్లు ముక్కలు చేసి, జోన్‌ను ప్రకటించడం కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల పోరాటానికి తలొగ్గి ఆఖరి నిమిషంలోనైనా విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ప్రకటించినందుకు కేంద్ర రైల్వేమంత్రికి అభినందనలు తెలియజేస్తున్నానని మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu