శ్రీదేవి చీర ఎంత పలికిందో తెలుసా!

స్టార్‌ హీరోయిన్‌ శ్రీదేవికి ఉన్న క్రేజ్‌ మనకు తెలిసిందే. ఆమె ధరించిన చీరల వెల కూడా భారీగానే ఉంటుందన్నది నిరూపణ అయ్యింది. తమిళం, తెలుగు, హిందీ అంటూ భారతీయ సినిమాలో అగ్రనటిగా, అతిలోక సుందరిగా వెలిగిన నటి శ్రీదేవి. అలాంటి శ్రీదేవి గత ఏడాది దుబాయిలో అకాలమరణానికి గురైన సంగతి తెలిసిందే. ఆమె ధరించిన ఖరీదైన చీరలను వేలం వేసి అలా వచ్చిన డబ్బును స్వచ్ఛంద సేవా సంస్థలకు అందించాలని శ్రీదేవి కుటుంబసభ్యులు భావించారు. అలా శ్రీదేవి చీరల వేలానికి సామాజిక మాధ్యమాన్ని వారు ఎంచుకున్నారు. శ్రీదేవికి చెందిన ఒక ఖరీదైన చీరకు ముందుగా రూ. 40 వేలను నిర్ణయించారు. అది ఆన్‌లైన్‌ వేలంలో రూ. 1.30 లక్షల ధర పలికింది. ఈ మొత్తాన్ని శ్రీదేవి భర్త బోనీకపూర్‌ కన్‌సర్న్‌ ఇండియా ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు అందించనున్నట్లు తెలిసింది. డబ్బుతో ఆసరా లేని మహిళలు, అనాథ బాలలు, వృద్ధుల సంక్షేమానికి ఉపయోగిస్తామని తెలిపారు. అలా అతిలోక సుందరి తాను లేకున్నా పది మందిని ఆదుకోవడానికి సహకరించారన్నమాట.