వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ భావోద్వేగం

ఏపీ కాబోయే సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించారు. వైఎస్ఆర్ సమాధిపై పూలమాల వేసి ఆయన కొద్దిసేపు మౌనంగా ప్రార్ధనలు చేశారు. జగన్‌తో పాటు ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, పలువురు పార్టీ నేతలు ఉన్నారు. అంతకు ముందు ఇడుపులపాయ చేరుకున్న జననేతకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్‌ జగన్‌ను కలుసుకునేందుకు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఇడుపులపాయ నుంచి హెలికాఫ్టర్‌లో కడప బయల్దేరారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో జగన్‌ గన్నవరం చేరుకోనున్నారు. అంతకుముందు వైఎస్ జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. మత పెద్దలు క్రీస్తు సందేశం వినిపించి.. జగన్‌ను ఆశీర్వదించారు. చర్చి కమిటీ సభ్యులు పూలమాల, శాలువాతో సత్కరించారు. వైఎస్‌ జగన్‌తో పాటు ఎంపీ అవినాష్‌ రెడ్డి కూడా ప్రార్థనల్లో పాల్గొన్నారు.